Kotamreddy Sridhar Reddy: అసెంబ్లీలో ప్లకార్డులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన

Kotamreddy Sridhar Reddy protests in assembly session

  • ప్రశ్నోత్తరాలు మొదలగానే తన స్థానంలో లేచి నిల్చున్న కోటంరెడ్డి
  • కూర్చోవాలని స్పీకర్ సముదాయించినా వినని వైనం
  • తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వంపై తన నిరసన కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను ప్రారంభించగానే తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి తన స్థానంలో ప్లకార్డుతో నిలబడ్డారు. దీంతో క్వశ్చన్ అవర్‌లో సభ్యులు మధ్యలో మాట్లాడకూడదని స్పీకర్ తెలిపారు. శ్రీధర్ రెడ్డి నిరసనను, ప్రభుత్వం, తాను కూడా గుర్తించామని స్పీకర్ అన్నారు. కానీ, ఇలా చేయడం తగదు, కూర్చుంటే ప్రభుత్వం స్పందిస్తుందని స్పీకర్ తమ్మినేని చెప్పినా కోటంరెడ్డి అలానే నిల్చుండిపోయారు. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి కావాలనే రగడ చేయాలనుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.  

ఆయన సభను ఇబ్బందిపెట్టి ప్రజల దృష్టిలో పడాలని చూస్తున్నారని ఆరోపించారు. శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి అని అవసరం అయితే ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. అంతకుముందు సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద కూడా కోటంరెడ్డి నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలో‌ని సమస్యల ప్లకార్డులను ప్రదర్శిస్తూ అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు.  ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందన్నారు. సమస్యలను పరిస్కరిస్తే తానే ముఖ్యమంత్రిని అభినందిస్తానన్నారు. మైకు ఇచ్చే వరకూ అసెంబ్లీలో మైక్ అడుగుతూనే ఉంటానన్నారు. మైక్ ఇవ్వకుంటే తన నిరసన ప్లకార్డుల రూపేణా నిలబడి ప్రదర్శిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News