Foods: దంపతుల కోర్కెలను పండించే ఫుడ్స్!
- తగ్గిపోతున్న శృంగార భావనలు
- మారిన జీవనశైలి, పోషకాల లేమి ప్రధాన కారణాలు
- కొన్ని రకాల పండ్లు తీసుకోవాలి
- రోజువారీ వ్యాయామాలు చేయాలి
దంపతుల మధ్య అనుబంధం బలంగా ఉండాలంటే శృంగారం కూడా సాఫీగా సాగిపోవాలి. కానీ, నేటి జీవనశైలి ఫలితంగా దంపతులు ఈ విషయంలో అసంతృప్తిగా ఉంటున్నారు. పెద్దగా కదలికలు లేని నిశ్చలమైన జీవితం, మానసిక ఒత్తిడి, వయసు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. కానీ, శృంగార జీవితం సంతోషకరంగా లేకపోతే పట్టించుకోవాల్సిందే. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. కనుక జీవనశైలిలో మార్పులు చేసుకుని, మంచి పోషకాహారం తీసుకోవడం ద్వారా దంపతులు తమ మధ్య సంతోషాన్ని పండించుకోవచ్చు. ఇందుకు ఏ ఆహారం తీసుకోవాలన్నది దిగ్విజయ్ సింగ్ అనే హెల్త్ కోచ్ తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో వెల్లడించారు.
బీట్ రూట్
బీట్ రూట్ లో నైట్రేట్స్ ఉంటాయి. బీట్ రూట్ మన శరీరంలోకి వెళ్లిన తర్వాత అది నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా శృంగారం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
వాటర్ మెలాన్(పుచ్చకాయ)
వేసవిలో పుచ్చకాయల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నీటి శాతాన్ని పెంచడానికి ఇది సాయపడుతుంది. వేడి వాతావరణానికి అత్యంత అనుకూలమైన పండు ఇది. నైట్రిక్ ఆక్సైడ్ ను పెంచే కాంపౌండ్ తోపాటు ఎల్ ఆర్జినిన్ పుచ్చకాయలో ఉంటాయి. ఈ రెండూ గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచుతాయి. దీంతో శృంగార జీవితం సాఫీగా సాగుతుంది.
డార్క్ చాక్లెట్లు
చాక్లెట్లను నచ్చని వారు ఉండరు. కాకపోతే అదేదో నల్లగా ఉండే డార్క్ చాక్లెట్లను తినడం మంచిది. ఇందులో ఉండే కాంపౌండ్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. మంచి మూడ్ కు చాక్లెట్లు సాయపడతాయి. ఈ చాక్లెట్లను తినడం వల్ల మెదడులో సెరటోనిన్, డోపమైన్ కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. దీంతో శృంగార కోర్కెలు పెరుగుతాయి.
నట్స్
ప్రతి రోజూ కొంత మేర నట్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది నిజం. పిస్తా, పీనట్స్ (పల్లీలు), వాల్ నట్స్ లో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి శక్తిని ఇస్తాయి. నట్స్ లో ఉండే జింక్ పురుషుల్లో టెస్టోస్టెరోన్ ను పెంచుతుంది.
దానిమ్మ, యాపిల్
మంచి రుచికి ఈ పండ్లు పెట్టింది పేరు. ఈ పండ్లలో పోషకాల విలువ ఎక్కువగా ఉంటుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను ఈ పండ్లు తగ్గిస్తాయి. దీంతో శృంగార కోర్కెలు పెరుగుతాయి.
ఈ పండ్లను తీసుకుంటూనే రోజువారీ 40 నిమిషాల పాటు ఏరో బిక్ (వాకింగ్, రన్నింగ్) వ్యాయామాలు చేయాలి. దీనివల్ల శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది.