AP Assembly: అసెంబ్లీ నుంచి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సస్పెన్షన్.. బడ్జెట్ సెషన్ మొత్తానికి వేటు!
- సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారంటూ కోటంరెడ్డిపై వేటు
- వెల్ లోకి వెళ్లి నినాదాలు చేసిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే
- ఇది న్యాయం కాదంటూ స్పీకర్ పై మండిపాటు
ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారంటూ ఆయనపై సెషన్ మొత్తం వేటు వేశారు. ఈ మేరకు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా.. వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు.
అంతకుముందు తమ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు. వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశారు. ‘‘మీ ప్లేస్ కు వెళ్లండి.. వెళ్లి కూర్చోండి’’ అంటూ కోటంరెడ్డికి స్పీకర్ సూచించగా.. అందుకు ఆయన నిరాకరించారు. ఇది న్యాయం కాదని శ్రీధర్ రెడ్డి అన్నారు.
ఈ సమయంలో అధికార పార్టీ నేతలు, కోటంరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేశామని, బయటికి వెళ్లాలని ఆయనకు స్పీకర్ సూచించారు. దీంతో వెల్ లో మెట్లపై నిలబడి శ్రీధర్ రెడ్డి నినాదాలు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేయాలని బుగ్గన తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని స్పీకర్ చదవి వినిపించారు.. మొత్తం సెషన్ నుంచి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సస్పెన్షన్ తర్వాత కోటంరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై గొంతెత్తుతాననే తనకు అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. గాంధీగిరీ పద్ధతిలో నిలబడే నిరసన తెలిపానని చెప్పారు. తన వద్ద ఉన్న ప్లకార్డు తీసుకొని చించేశారని, ఇదేంటని అడిగితే సస్పెండ్ చేశారని ఆరోపించారు.