Boora Narsaiah Goud: ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ తెలంగాణలో జరిగింది.. మాజీ ఎంపీ సంచలన ఆరోపణలు
- ఫారిన్ లిక్కర్ సేల్స్ తో ఓ వ్యక్తికి వందల కోట్లు వస్తున్నాయన్న బూర నర్సయ్య గౌడ్
- హైదరాబాద్‌లో ఒక వైన్స్‌లో రోజుకు రూ.కోటి సేల్స్ జరుగుతున్నాయని ఆరోపణ
- షాపు, వ్యక్తి పేరు త్వరలో బయటపెడతామని వెల్లడి
ఢిల్లీ లిక్కర్ స్కామ్.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అటు ఢిల్లీలో కలకలం రేపింది. అయితే అంతకుమించిన కుంభకోణం తెలంగాణలో జరిగిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీకి మించి తెలంగాణలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని అన్నారు. త్వరలో ఆధారాలతో సహా బయట పెడతామని చెప్పారు.
ఫారిన్ లిక్కర్ సేల్స్ ద్వారా తెలంగాణలో ఒక వ్యక్తికి వందల కోట్ల లబ్థి చేకూరుతోందని బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ‘‘ఫారిన్ లిక్కర్ పాలసీకి ఐదేళ్ల కాలపరిమితి ఇవ్వటానికి కారణమేంటో తేల్చాలి. ఫారిన్ లిక్కర్ టెండర్‌కు 24 గంటలే సమయం ఇవ్వటానికి కారణమేంటి? టెండర్లో కేవలం ఒక్క అప్లికేషన్ మాత్రమే ఎందుకొచ్చింది?’’ అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో ఒక వైన్స్‌లో రోజుకు కోటి రూపాయలు సేల్స్ జరుగుతున్నాయని నర్సయ్య చెప్పారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఒక ప్రైవేట్ వ్యక్తికి వెళ్తోందని తెలిపారు. షాపు పేరు, వ్యక్తి పేరు త్వరలో బయటపెడతామని మాజీ ఎంపీ పేర్కొన్నారు.