Heavy Rains: ఎల్లుండి ఏపీలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ
- బంగాళాఖాతంలో రెండు ద్రోణులు
- ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
- అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో.. మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, పొట్టిశ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 18న భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు ఒకటి, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు మరో ద్రోణి ఏర్పడిందని, ఈ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి ఏపీ వైపు తేమ గాలులు వీస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.