Andhra Pradesh: అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్
- బడ్జెట్ సమావేశంలో వాయిదా తీర్మానాలపై చర్చకు టీడీపీ పట్టు
- టీడీపీ సభ్యుల నినాదాలతో హోరెత్తిన సభ
- తెలుగుదేశం సభ్యులను సస్పెండ్ చేయాలంటూ మంత్రి బుగ్గన తీర్మానం
- బుగ్గన తీర్మానానికి స్పీకర్ ఆమోదం, టీడీపీ సభ్యులపై వేటు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం 14 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశానికి అడ్డుపడుతున్నారంటూ వారిపై ఒక రోజుపాటు సస్పెన్షన్ వేటు వేశారు. అంతకుమునుపు.. ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చించాలంటూ పట్టుపట్టారు. బుగ్గన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.
ఈ క్రమంలో తెలుగుదేశం సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే అసెంబ్లీని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సంప్రదాయాలను పాటించాలంటూ హితవు పలికారు. స్పీకర్ కూడా టీడీపీ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. అయితే టీడీపీ సభ్యులు మాత్రం తమ నిరసన కొనసాగించారు. దీంతో.. వారిని సస్పెండ్ చేయాలంటూ మంత్రి బుగ్గన సభలో ఓ ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన స్పీకర్ టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు.