Hail Storm: తెలంగాణలో పలు చోట్ల వడగండ్ల వానలు
- ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో వర్షాలు
- ఝార్ఖండ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి
- ఒడిశా వైపు కదిలిన ద్రోణి
- ఈ నెల 18న భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ కేంద్రం
ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్యాహ్నం పలుచోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. వికారాబాద్, సంగారెడ్డి, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. చేవెళ్ల నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. సంగారెడ్డి జిల్లాలో కోహిర్ మండలం బడంపేట్, మనియార్ పల్లిలో ఈదురుగాలులతో వర్షం కురిసింది.
కాగా, ఈ నెల 18న భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తమ్మీద 5 రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఝార్ఖండ్ నుంచి చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ఒడిశా వైపు కదిలినట్టు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.