YS Vivekananda Reddy: హైకోర్టులో పిటిషన్ వేసిన వివేకా పీఏ కృష్ణారెడ్డి
- వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ
- కేసు విచారణ తెలంగాణకు బదిలీ
- దస్తగిరిని అప్రూవర్ గా అనుమతించడాన్ని సవాల్ చేసిన కృష్ణారెడ్డి
- కృష్ణారెడ్డికి పిటిషన్ వేసే అర్హత లేదన్న సీబీఐ
గత ఎన్నికల సమయంలో మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగడం తెలిసిందే. వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రైవర్ దస్తగిరిని అప్రూవర్ గా అనుమతించడాన్ని సవాల్ చేశారు. సీబీఐ కుట్రపూరితంగా దర్యాప్తు చేస్తోందని కృష్ణారెడ్డి ఆరోపించారు. దీనిపై సీబీఐ స్పందించింది. ఈ కేసుకు సంబంధించి కృష్ణారెడ్డికి పిటిషన్ వేసే అర్హత లేదని హైకోర్టుకు తెలిపింది. అనంతరం, కృష్ణారెడ్డి పిటిషన్ పై వాదనలను హైకోర్టు ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
అటు, వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి మధ్యంతర పిటిషన్లపై రేపు తీర్పు వెలువడనుంది. తనపై సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా నిలువరించాలని అవినాశ్ పిటిషన్ దాఖలు చేయగా, తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే.
పార్లమెంటు సమావేశాలు ఉన్నందున తన తదుపరి విచారణపై స్టే ఇవ్వాలన్న అవినాశ్ అభ్యర్థనపైనా హైకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది.