Delhi Capitals: డబ్ల్యూపీఎల్: కొట్టేస్తారనుకుంటే చతికిలపడ్డారు!

Delhi Capitals lost to Gujarat Giants in low scores battle

  • స్వల్ప స్కోర్ల మ్యాచ్ లో ఓటమిపాలైన ఢిల్లీ క్యాపిటల్స్
  • అద్భుతంగా ఆడిన గుజరాత్ జెయింట్స్
  • 11 పరుగుల తేడాతో ఢిల్లీపై జయభేరి
  • టోర్నీలో రెండో విజయం నమోదు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జెయింట్స్ అమ్మాయిలు అద్భుత ఆటతీరు కనబర్చారు. సాధించింది తక్కువ స్కోరే అయినా, అవతల ఉన్నది పెద్ద జట్టు అయినా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీతో, ఐదో స్థానంలో ఉన్న గుజరాత్ తలపడగా... గుజరాత్ నే విజయం వరించింది. 

ఈ మ్యాచ్ లో గుజరాత్ 11 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. తొలుత గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.4 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌట్ అయింది. 

గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ 2, తనూజా కన్వర్ 2, ఆష్లే గార్డనర్ 2, కెప్టెన్ స్నేహ్ రాణా 1, హర్లీన్ డియోల్ 1 వికెట్ తీశారు. ఢిల్లీ బ్యాటర్లలో మరిజేన్ కాప్ 36, అరుంధతి రెడ్డి 25, అలిస్ కాప్సే 22 పరుగులు చేశారు. 

ఈ మ్యాచ్ లో ఆఖర్లో కొద్దిగా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ బ్యాటర్ అరుంధతి రెడ్డి పోరాడడంతో ఆ జట్టు లక్ష్యాన్ని అందుకునేలా కనిపించింది. అయితే, అరుంధతిని కిమ్ గార్త్ అవుట్ చేయడంతో మ్యాచ్ గుజరాత్ వైపు మొగ్గింది. పూనమ్ యాదవ్ ను గార్డనర్ అవుట్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ కు తెరపడింది. 

ఈ విజయంతో గుజరాత్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. గుజరాత్ ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు, నాలుగు ఓటములు నమోదు చేసింది.

  • Loading...

More Telugu News