Rishab Shetty: కాంతార సినిమాకు అరుదైన గౌరవం.. ఐరాస కార్యాలయంలో నేడు ప్రదర్శన
- రికార్డులు కొల్లగొట్టిన ‘కాంతార’
- ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల వసూలు
- పర్యావరణంపై భారతీయ సినిమాల ప్రభావంపై రిషబ్ శెట్టి ప్రసంగం
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార’ సినిమా సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసింది. తాజాగా, ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది.
జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో నేడు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో నటుడు, దర్శకుడు రిషభ్ శెట్టి ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకున్నారు. సినిమా స్క్రీనింగ్ ముగిసిన అనంతరం పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమాల పాత్రపై ఆయన ప్రసంగిస్తారు.
పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తాయి
భారతీయ సినిమాలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాయని, తన సినిమా ‘కాంతార’లోనూ ఆ అంశాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు. ప్రకృతితో మన సంబంధాన్ని ఈ సినిమా చెబుతుందన్నారు. పర్యావరణ సవాళ్లను స్వీకరించి, సంబంధిత సమస్యలను ఇలాంటి సినిమాలు పరిష్కరిస్తాయని రిషభ్ శెట్టి అన్నారు. కాగా, ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శితమయ్యే తొలి చిత్రంగా ‘కాంతార’ రికార్డులకెక్కబోతోంది.