BJP: తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఉత్కంఠ విజయం
- 1,150 ఓట్ల తేడాతో గెలుపు
- మొదటి ప్రాధాన్యత ఓటులో తేలని ఫలితం
- రెండో ప్రాధాన్యత ఓటులో ఏవీఎన్ రెడ్డిని వరించిన విజయం
తెలంగాణలో అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. గురువారం ఉదయం మొదలై శుక్రవారం తెల్లవారు జామున వరకు జరిగిన కౌంటింగ్ హోరాహోరీగా నడిచింది.
చివరకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏవీఎన్ రెడ్డిని విజయం వరించింది. సమీప పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో ఏవీఎన్ రెడ్డి గెలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డికి 7,505 ఓట్లు రాగా, పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డికి 6,584, యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డికి 4,569, కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డికి 1,907 ఓట్లు వచ్చాయి.
పోలైన మొత్తం ఓట్లలో ఏ అభ్యర్థికి కూడా 50 శాతం కంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యత ఓట్లు రాకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టడంతో ఏవీఎన్ రెడ్డి గెలిచారు. కాగా, ఈ నెల 13న జరిగిన పోలింగ్ లో మొత్తం 29,720 ఓట్లకు గాను 25,868 ఓట్లు పోలవగా, అందులో 452 ఓట్లు చెల్లకుండా పోయాయి.