Conman: ఏకంగా పీఎంఓ ఉన్నతాధికారి అవతారం ఎత్తిన ఆర్థిక నేరగాడు.. జమ్మూ కశ్మీర్ లో అధికారులతో భేటీ
- జమ్మూ కశ్మీర్ సందర్శనకు వెళ్లి రాచమర్యాదలు అందుకున్న వైనం
- వ్యక్తిగత భద్రతా అధికారి, విలాసవంతమైన హోటల్ గది ఏర్పాటు చేసిన స్థానిక అధికారులు
- శ్రీనగర్ లో అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
గుజరాత్ కు చెందిన ఓ ఆర్థిక నేరగాడు ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ)లోని ఉన్నత స్థాయి అధికారి అవతారం ఎత్తాడు. తాను పీఎంఓలో అదనపు డైరెక్టర్ గా పని చేస్తున్నానని చెప్పి జమ్మూ కశ్మీర్ లోని ఉన్నతాధికారులతో సమావేశాలు సైతం నిర్వహించాడు. అంతేకాదు గతేడాది అక్టోబర్ నుంచి అతను కశ్మీర్ ను సందర్శిస్తున్నాడు. అతను వచ్చినప్పుడల్లా ప్రభుత్వ ఆతిథ్యంలో అక్కడి అధికారులు రాచమర్యాదలు చేస్తున్నారు. చివరకు అసలు విషయం తెలిసి అధికారులు కంగుతిన్నారు. ఆఖరికి పోలీసులు ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ వ్యక్తి పేరు కిరణ్ భాయ్ పటేల్. గుజరాత్ కు చెందిన ఇతను పీఎంఓ అధికారిని అని చెప్పి శ్రీనగర్‌లోని నిషాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో హల్ చల్ చేశాడు. అక్కడికి వచ్చినప్పుడల్లా ప్రభుత్వ ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ.. అక్కడి అధికారులతో సమీక్షలు సైతం చేశాడు. స్థానిక పోలీసులు కిరణ్ కు ఓ వ్యక్తిగత భద్రతా అధికారితో పాటు ఒక విలాసవంతమైన హోటల్‌లో గది కూడా ఏర్పాటు చేశారు. అయితే, జమ్మూ కశ్మీర్ సీఐడీ అధికారులు అతను ఫేక్ అధికారి అని గుర్తించారు.
శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద పోలీసులు కిరణ్ ను అరెస్ట్ చేసి ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, కిరణ్ ఫేక్ అధికారి అని సకాలంలో ఎందుకు గుర్తించలేదని పుల్వామా డిప్యూటీ కమిషనర్ బషీర్ ఉల్ హక్, పోలీసు సూపరింటెండెంట్ ఆజాద్‌ను జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు ప్రశ్నించారు. మరోవైపు ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ పోలీసులు పెదవి విప్పడం లేదు.