Ajay Devgn: వాళ్లందరూ ఒక్క ఫోన్ దూరంలోనే.. ఇతర బాలీవుడ్ నటులతో స్నేహంపై అజయ్ దేవగణ్ వ్యాఖ్యలు!
- ‘భోళా’ సినిమా ప్రమోషన్లలో బిజీగా అజయ్ దేవగణ్
- అక్షయ్, సల్మాన్, షారూఖ్.. ఇలా అందరం తరచూ మాట్లాడుకుంటామని వెల్లడి
- ఒకరిని ఇంకొకరు నమ్ముతామని వ్యాఖ్య
- ట్రోల్స్ ను పట్టించుకోకుండా ఉండటం నేర్చుకున్నానన్న బాలీవుడ్ స్టార్
ప్రస్తుతం ‘భోళా’ సినిమా ప్రమోషన్లలో అజయ్ దేవగణ్ బిజీగా ఉన్నారు. కార్తీ ఖైదీ సినిమాకు రీమేక్ వస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖరులో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో పలు అంశాల గురించి ‘ఫిల్మ్ ఫేర్’తో ముచ్చటించారు. ఇతర బాలీవుడ్ హీరోలతో తన స్నేహంపై స్పందించారు.
‘‘మేం వ్యక్తిగతంగా కలవకపోవచ్చు. కానీ మేం తరచూ మాట్లాడుకుంటాం. అందరూ కేవలం ఒక కాల్ దూరంలోనే ఉన్నారు. అవసరమైనప్పుడు మేం ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటాం. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, సునీల్ శెట్టి, సంజయ్ దత్.. ఇలా మేం ఒకరిని ఇంకొకరు నమ్ముతాం. ఒకరి కోసం మరొకరు ఉన్నాం’’ అని అజయ్ దేవగణ్ చెప్పుకొచ్చారు.
తన పిల్లలపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి అజయ్ మాట్లాడుతూ.. వాటిని పట్టించుకోకుండా ఉండటం నేర్చుకున్నానని చెప్పారు. ‘‘ట్రోల్స్ చేసేవాళ్లలో ప్రేక్షకులు చాలా తక్కువ మంది ఉంటారు. సాధారణ వ్యక్తులకు ఎన్నో సమస్యలు ఉంటాయి. వాళ్లు సినిమాలు, సినిమా తారల గురించి పట్టించుకునే పరిస్థితి ఉండదు. వాళ్లు ట్రైలర్ చూస్తారు. నచ్చితే సినిమాను చూస్తారు. మహా అయితే స్నేహితులు, కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. అంతేతప్ప ట్రైలర్ లేదా సినిమా గురించి ఆన్లైన్లో వ్యాఖ్యలను పోస్ట్ చేస్తారని నేను అనుకోను’’ అని వివరించారు.
నెగటివిటీనీ విస్మరించడం నేర్చుకున్నానని.. తన పిల్లలను కూడా అలానే చేయమని చెప్పానని అజయ్ వివరించారు. టబుతో ఎక్కువగా సినిమాలు చేయడంపై స్పందిస్తూ.. ‘‘కేవలం విజయ్ పథ్ సినిమా నుంచే కాదు.. 13 - 14 ఏళ్ల నుంచి తను నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చారు.