Womans Heart Cooks: అఫ్తాబ్, హరిహరకృష్ణలను మించిన కిరాతకుడు ఇతడు.. 5 జీవిత ఖైదులు విధించిన కోర్టు!
- 2021లో వరుస హత్యలకు పాల్పడిన లారెన్స్ పౌల్ అండర్సన్
- ఓ మహిళను చంపి.. గుండెను బయటికి తీసిన వైనం
- బంగాళాదుంపలతో కలిపి కూర చేసి.. బంధువులకు తినిపించే ప్రయత్నం
- ఈ క్రమంలో మరో ఇద్దరి హత్య.. అమెరికాలోని ఓక్లహామాలో ఘటన
స్నేహితుడు నవీన్ ను చంపిన హరిహర కృష్ణ.. ప్రియురాలిని ముక్కలుగా చేసిన అఫ్తాబ్ పూనావాలా కంటే కిరాతకుడు ఇతడు. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేంత దారుణానికి పాల్పడ్డాడు. చేసిన తప్పుకు ఐదు జీవిత ఖైదులు అనుభవిస్తున్నాడు. అమెరికాలోని ఓక్లహామాలో జరిగిందీ ఘటన.
లారెన్స్ పౌల్ అండర్సన్ అనే నల్ల జాతీయుడు 2021లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. తొలుత అండ్రియా బ్లాంకెన్ షిప్ అనే మహిళను చంపాడు. తర్వాత శరీరం నుంచి ఆమె గుండెను బయటికి తీశాడు. దాన్ని తన బంధువుల ఇంటికి తీసుకెళ్లి.. బంగాళాదుంపలతో కలిపి కూర చేశాడు. ఆ కర్రీని తన బంధువులకు తినిపించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన బంధువులైన 67 ఏళ్ల లియోన్, నాలుగేళ్ల కియోస్ యేట్స్ ను చంపేశాడు.
నిజానికి డ్రగ్స్ కేసులో అరెస్టయిన అండర్సన్ కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కానీ ఓక్లహామా గవర్నర్ కెవిన్ స్టిట్ పుణ్యామా అని 3 ఏళ్లకే అతడు విడుదల అయ్యాడు. క్రమశిక్షణతో ఉన్న, పరివర్తన చెందిన ఖైదీలను ముందుగా విడుదల చేయగా.. అందులో అండర్సన్ కూడా ఉన్నాడు. కానీ ఇక్కడే తప్పు జరిగింది. రిలీజ్ చేయాల్సిన ఖైదీల లిస్టులో అతడి పేరును పొరపాటుగా చేర్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ పొరపాటు ఖరీదు మూడు ప్రాణాలు!
జైలు నుంచి విడుదలైన నెల రోజుల్లోనే ఈ మూడు హత్యలకు అండర్సన్ పాల్పడ్డాడు. దీంతో అండర్సన్ కు వరుసగా ఐదు జీవిత ఖైదులను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు అండర్సన్ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడిన వాళ్లు.. న్యాయ పోరాటానికి దిగారు. శిక్ష పూర్తి కాకముందే అండర్సన్ ను రిలీజ్ చేసి, మూడు హత్యలకు కారణమయ్యారని ఓక్లహామా గవర్నర్, జైలు పెరోల్ బోర్డుపై కేసులు వేశారు.