KTR: బండి సంజయ్ తెలివి లేని దద్దమ్మ అని మరోసారి రుజువైంది: కేటీఆర్ విమర్శలు
- టీఎస్ పీఎస్సీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం తక్కువగా ఉంటుందన్న కేటీఆర్
- కనీస అవగాహన లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని విమర్శ
- ఇలాగే మాట్లాడితే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక
టీఎస్ పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అని... అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం చాలా తక్కువగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ విషయం కూడా తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న బండి సంజయ్ మహా అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ తెలివి లేని దద్దమ్మ అనే విషయం మరోసారి రుజువయిందని అన్నారు. పభుత్వ వ్యవస్థల పనితీరు, వాటి పరిధులపై కనీస అవగాహన కూడా లేకుండా బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడు ఎలా అయ్యాడో అని విమర్శించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దిగజారిపోయి వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు.
భూరికార్డుల ప్రక్షాళన కోసం తీసుకొచ్చిన ధరణిపై కూడా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో ముడిపెట్టి తనపై అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే పరువునష్టం కేసు ఎదుర్కొంటున్నా బండి సంజయ్ కి బుద్ధి రాలేదని చెప్పారు. తనకు సంబంధం లేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని... ఇలాగే మాట్లాడితే రాబోయే రోజుల్లో క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగ నియామక ప్రక్రియలో క్వశ్చన్ పేపర్లు లీకైన సందర్భాలు వందల్లో ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. గుజరాత్ లోనే గత 8 సంవత్సరాల్లో 13 సార్లు పేపర్ లీక్ అయిందని... దీనికి ప్రధాని మోదీని బాధ్యుడిని చేసి రాజీనామాను డిమాండ్ చేయాలని సంజయ్ కు సవాల్ విసిరారు. బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని మండిపడ్డారు.