Nara Lokesh: పాదయాత్ర చేసిన జగన్ కు ఇప్పటి జగన్ కు చాలా తేడా ఉంది: నారా లోకేశ్
- ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగిసిన లోకేశ్ పాదయాత్ర
- శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రవేశించిన యువగళం
- లోకేశ్ కు కదిరి నియోజకవర్గంలో ఘనస్వాగతం
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు కమ్మపల్లి విడిది కేంద్రం నుండి ప్రారంభమైంది. దారిపొడవునా యువనేత పాదయాత్రకు జనం పోటెత్తారు. ములకపల్లిలో నిర్వహించిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తంబళ్లపల్లి నియోజకవర్గ పర్యటన పూర్తిచేసుకొని శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించింది.
తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో జగన్ బిల్డప్ బాబాయ్ మాదిరి ఎడాపెడా హామీలిచ్చి సీఎం అయ్యాక హామీలు నెరవేర్చకపోగా ప్రజలనెత్తిన రకరకాల భారాలు మోపుతూ హింసించే పులకేసి మాదిరిగా తయారయ్యారని లోకేశ్ దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా తన గొంతునొక్కేందుకు ప్రయత్నించినా 45రోజులపాటు తనను కన్నబిడ్డలా ఆదరించారంటూ చిత్తూరు జిల్లా ప్రజలకు కృతజ్జతలు తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు చూశాక యువగళాన్ని ఎందుకు అడ్డుకోవాలని చూశారో అర్థమైందని అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత బయటకు వస్తుందనే ఉద్దేశంతోనే యువగళం గొంతునొక్కాలని కుట్రపన్నారు.
"డబ్బుతో ఏమైనా చేయొచ్చని భ్రమపడుతున్నావ్... పట్టభద్రుల ఎన్నికల్లో 3 స్థానాలను గెలవబోతున్నాం... గ్రాడ్యుయేట్ ఓటర్లను డబ్బుతో కొనగలిగారా? తాడేపల్లి ప్యాలెస్ కు తాళాలేసే రోజు దగ్గర్లోనే ఉంది, సిద్ధంగా ఉండాలి. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో సైకిల్ హవా మొదలైంది. జగన్ పని అయిపోయింది. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే.
పాదయాత్రలో జగన్ వేరు... సీఎం అయ్యాక వేరు!
పాదయాత్ర చేసిన జగన్ వేరు, సీఎం అయిన జగన్ వేరు అని లోకేశ్ విమర్శించారు.. పాదయాత్రలో జగన్ ఒక బిల్డప్ బాబాయ్ అని, సీఎం అయ్యాక జగన్ ఒక హింసించే పులకేశి తరహాలో మారిపోయాడని అన్నారు.
"యువతకు బిల్డప్ బాబాయ్ బీభత్సమైన హామీలు ఇచ్చాడు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి ఏడాది 6,500 పోలీసు ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా డీఎస్సీ అని ఊదరగొట్టాడు. అధికారంలోకి వచ్చాక హింసించే పులకేశి చేసింది ఏంటి? ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా పిల్లలు చదువుకుంటే ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వాలో అని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎత్తేసాడు, ఎయిడెడ్ స్కూల్స్ నాశనం చేసాడు, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కట్ చేసాడు, విదేశీ విద్య క్లోజ్ చేసాడు.
పాదయాత్ర చేసినప్పుడు మహిళలకు బిల్డప్ బాబాయ్ అనేక హామీలు ఇచ్చాడు. మద్యపాన నిషేధం, 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్, దిశ చట్టం, ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తానని హామీ ఇచ్చాడు. హింసించే పులకేశి చేసింది ఏంటి? జే బ్రాండ్లు తెచ్చి మహిళల తాళిబొట్టు తాకట్టు పెట్టాడు. అమ్మఒడిని అర్ధఒడి చేసాడు, పెన్షన్ మాటే లేదు. దిశ పేరుతో మోసం తప్ప చట్టం లేదు" అని విమర్శించారు.
రూ.3వేల పెన్షన్ ఇచ్చాడా...?
పాదయాత్ర చేసినప్పుడు వృద్ధులకు బిల్డప్ బాబాయ్ 3 వేల పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చాడు. హింసించే పులకేశి చేసింది ఏంటి? రూ.250 పెంచి ఒక్కో అవ్వాతాత దగ్గర రూ.18000 కొట్టేసాడు. 6 లక్షల పెన్షన్లు కట్ చేసాడు. పాదయాత్ర చేసినప్పుడు రైతులకు అనేక హామీలు ఇచ్చాడు బిల్డప్ బాబాయ్. రూ.13,500 రైతు భరోసా అన్నాడు. హింసించే పులకేశి చేసింది ఏంటి రైతు భరోసా లో 6వేలు కట్ అంటే ఒక్కో రైతు నుండి 30 వేలు స్వాహా. వారంలో సీపీఎస్ రద్దు అన్నాడు, పోలీసులకు అన్ని బెనిఫిట్స్ ఇస్తాం అన్నాడు. హింసించే పులకేశి చేసింది ఏంటి? ఒకటో తారీఖున జీతం ఇచ్చే దిక్కు లేదు. పోలీసులకు 4 సరెండర్స్ పెండింగ్ పెట్టాడు. 8 టీఏ, డీఏలు పెండింగ్.
రాయలసీమకు శనిలా దాపురించాడు!
బిల్డప్ బాబాయ్ రాయలసీమ బిడ్డని అన్నాడు. హింసించే పులకేశి రాయలసీమకు శనిలా తయారయ్యాడు. రెండుసార్లు కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసాడు. ముందు 20 వేల మందికి ఉద్యోగాలు అన్నాడు. ఇప్పుడు 6 వేల మందికి అంటున్నాడు. రెండు సార్లు చేసిన శంకుస్థాపన కోసం సొంత మీడియాకి 30 కోట్లు ప్రకటనలు ఇచ్చాడు. 30 పైసలు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఖర్చు చెయ్యలేదు.
అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం రూ.5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 62 మంది చనిపోయారు. వారిని పట్టించుకోకుండా గాలికొదిలేశాడు. ఇదేనా రాయలసీమపై ప్రేమంటే?
చర్చకు ఇప్పుడైనా నేను సిద్ధం!
45 రోజులుగా జిల్లాలో చూస్తున్నా... క్యాన్సర్ లా జిల్లాను పెద్దిరెడ్డి కుటుంబం పీడిస్తోంది. జిల్లాలో మైన్, వైన్, శాండ్, ల్యాండ్... ఎక్కడ చూసినా పీఎల్ఆర్ వాహనాలే ఉంటున్నాయి. ప్రజా ధనాన్ని ఎలా దోస్తున్నారో ఆలోచించాలి. రూ.10 వేల కోట్లు పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంది.
పాపాల మిథున్ రెడ్డికి అభివృద్ధిపై సవాల్ చేస్తే... పోలీసులతో ఎన్నికల కోడ్ ఉందని తెల్లవారు జామును 4 గంటలకు అధికారులను, పోలీసులను పంపిచాడు. చట్టంపై ఉన్న గౌరవంతో బయటకు వెళ్తే లోకేశ్ భయపడి వెళ్లాడని చంకలు గుద్దుకున్నారు. మళ్లీ వచ్చి నేను సవాల్ చేస్తే... నేను పార్లమెంట్ కు వెళ్లానని మిథున్ రెడ్డి అంటున్నాడు. ఏం చేస్తావ్ పార్లమెంట్ లో? రెండుసార్లు ఎంపీగా గెలిచావు... ఒక్క సంస్థైనా రాజంపేటకు తీసుకొచ్చావా? పాపాల మిథున్ రెడ్డీ నీకు ధైర్యం ఉంటే రా... నేను ఎప్పుడైనా సిద్ధమే. మీలాగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోం. మీసం మెలేసి చెప్తున్నా... భయం నా బయోడేటాలో లేదు.
ఉమ్మడి చిత్తూరు ప్రజల రుణం తీర్చుకుంటా!
పాపాల పెద్దిరెడ్డి ఆధిపత్యం కోసం మదనపల్లిని జిల్లా కాకుండా చేశారు. మదనపల్లి కేంద్రంగా పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి, పీలేరును కలిపి జిల్లా చేస్తాం. చిత్తూరు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నా. నాకు రక్షణగా ప్రజలు నిలబడ్డారు. బంగారుపాళ్యం, పీలేరులో అడ్డుకుంటే వైసీపీ నేతల పళ్లు రాలగొట్టారు. 45 రోజుల పాదయాత్రలో మీరు ఆశీర్వదించారు... దీవించారు... మీ రుణం తీర్చుకుంటా. పాదయాత్రను జయప్రదం చేసిన ప్రజలు, కార్యకర్తలు, పోలీసులకు నా ధన్యవాదాలు. పోలీసుల సమస్యలు తీర్చేది కూడా మా ప్రభుత్వమే. 2024లో తంబళ్లపల్లి గడ్డపై పసుపుజెండా ఎగురవేయాలని పిలుపునిస్తున్నా.
=====
యువగళం పాదయాత్ర వివరాలు
*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 576.9కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 11.8 కి.మీ.*
*యువగళం పాదయాత్ర 46వ రోజు షెడ్యూల్ (18-3-2023)*
*కదిరి నియోజకవర్గం (శ్రీ సత్యసాయి జిల్లా).*
ఉదయం
8.00 – చీకటిమానుపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.45 – గంగసానివారిపల్లిలో టమోటారైతులతో భేటీ.
9.30 – భీసేనివారిపల్లి (సదుం పంచాయితీ)లో బలిజ సామాజికవర్గీయుల సమావేశం.
10.25 – కొక్కంటి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
11.15 - కొక్కంటి క్రాస్ వద్ద భోజన విరామం.
మధ్యాహ్నం
1.15 – భోజన విరామ స్థలంలో ఎస్టీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
సాయంత్రం
3.00 – మందిపల్లిలో స్థానికులతో మాటామంతీ.
4.30 – తనకల్లులో ఎస్సీ సామాజికవర్గ ప్రముఖులతో భేటీ.
6.00 – చినపిల్లోలపల్లి (తల్లమానువారిపల్లి పంచాయితీ) విడిది కేంద్రంలో బస.
***********