China: కరోనా వైరస్ మానవ సృష్టి కాదని తేల్చేసిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం!
- 2019లో వుహాన్ చేపల మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి
- ప్రయోగశాలలో పుట్టింది కాదని నిర్ధారణకొచ్చిన శాస్త్రవేత్తలు
- రాకూన్ జాతి శునకాల నుంచి వైరస్ వ్యాపించి ఉంటుందన్న దానిపై స్పష్టత కరవు
కరోనా వైరస్ ఎలా పుట్టింది? అది మానవ సృష్టా? లేదంటే ప్రకృతి పరంగా సహజంగానే పుటుకొచ్చిందా? ఈ ప్రశ్నకు సమాధానం లభించింది. ఆ వైరస్ మానవ నిర్మితం కాదని, ప్రకృతి సిద్ధంగానే పుట్టుకొచ్చిందని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తేల్చింది. చైనాలోని వుహాన్‌లో చేపల మార్కెట్‌లో విక్రయించిన రాకూన్ జాతి కుక్కల జన్యుపదార్థంలో కొవిడ్ కారక సార్స్‌కోవ్-2ను వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్టు శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఈ మేరకు ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. కరోనా వైరస్ ప్రయోగశాల నుంచి లీకై ఉండొచ్చని అమెరికా ఇంధన శాఖ అంచనా వేసిన కొన్ని రోజులకే అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం అందుకు విరుద్ధమైన విషయాన్ని వెల్లడించడం గమనార్హం.
2019లో చైనాలోని వుహాన్‌లో కరోనా తొలి కేసు వెలుగు చూసింది. దీంతో జనవరి 2020లో అక్కడి చేపల మార్కెట్‌ను మూసివేశారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలు అక్కడి గోడలు, ఖాళీ బోనులు, గచ్చుల మీది నుంచి నమూనాలు సేకరించారు. వీటి జీనోమ్ సీక్వెన్స్‌ను అంతర్జాతీయ ఏవియన్ ఫ్లూ సమాచార మార్పిడి వేదికపై ఉంచారు. మార్కెట్లోని ఓ బండిపై పక్షుల పంజరం, వేరే బోనులో రాకూన్ కుక్కలను ఉంచినట్టు శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది.
అక్కడ సేకరించిన జన్యు నమూనాలో రాకూన్ శునకం న్యూక్లిక్ ఆమ్లం, వైరస్ న్యూక్లిక్ ఆమ్లం కలిసి ఉన్నట్టు గుర్తించారు. రాకూన్ కుక్కకు వైరస్ సోకినా అది నేరుగా దాని నుంచి మానవులకు వ్యాపించి ఉండకపోవచ్చని, పైపెచ్చు మానవుల ద్వారానే అది దానికి సోకి ఉండొచ్చని కూడా శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. లేదంటే మరేదైనా జంతువు నుంచి కూడా దానికి సోకి ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకైతే మాత్రం మానవుల నుంచే దానికి వైరస్ సోకిందన్న వాదనకే మొగ్గు చూపుతున్నారు.