Hyderabad: హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం
- రాజేంద్రనగర్ లో ప్లాస్టిక్ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు
- పది ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
- ప్లాస్టిక్ కాలిన పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. డెక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ ల్లో ప్రమాదాలు పలువురిని పొట్టనపెట్టుకున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ శాస్త్రీపూరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోదాంలో జరిగిన అగ్గి రాజుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలకు గోదాంలోని రెండు డీసీఎం వాహనాలు దగ్ధం అయ్యాయి. ప్లాస్టిక్ కాలిన ఘాటైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. గోదాం పక్కనే ఉన్నపాఠశాలను అధికారులు ఖాళీ చేయించారు.
పాఠశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష సెంటర్ ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కానీ, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాల గోదాంలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.