COVID19: పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్కరోజే 800కి పైగా నమోదు
- నెల రోజుల్లో ఆరు రెట్లు పెరిగిన కరోనా కేసులు
- ఫిబ్రవరి 18న 112.. తాజాగా 841 కేసులు
- 126 రోజుల తర్వాత ఈ స్థాయిలో నమోదు
- ఝార్ఖండ్ లో ఒకరు, మహారాష్ట్రలో ఒకరు చనిపోయారని వైద్యారోగ్య శాఖ వెల్లడి
కరోనా కథ ముగిసిందనుకుంటే.. పెరుగుతున్న కేసులు మళ్లీ కలవర పెడుతున్నాయి. వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 800కి పైగా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. 126 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదైనట్లు తెలిపింది.
రోజు వారీ కేసుల సంఖ్య నెలరోజుల్లోనే ఆరు రెట్లు పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఫిబ్రవరి 18న 112 కేసులు మాత్రమే నమోదైనట్లు వెల్లడించింది. తాజాగా 841 కేసులు నమోదు కాగా, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,389కి చేరినట్లు తెలిపింది. ఝార్ఖండ్ లో ఒకరు, మహారాష్ట్రలో ఒకరు చనిపోయారని వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది.
యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య అదే స్థాయిలో ఉందని, మరణాల రేటు అతి స్వల్పంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద.. ఇప్పటి వరకు 220 కోట్ల డోసులు ఇచ్చినట్లు వెల్లడించింది.