Sajjala Ramakrishna Reddy: ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దు: సజ్జల
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలి
- కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయన్న సజ్జల
- ఈ ఫలితాలు ఏ విధంగానూ ప్రభావం చూపవని వ్యాఖ్యలు
- టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదమని వెల్లడి
- టీచర్ ఎమ్మెల్సీల్లో తమకు పట్టం కట్టారని వివరణ
ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల పవనాలు వీచిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఓట్ల బండిల్ లో ఏదో గందరగోళం జరిగిందని అన్నారు. కౌంటింగ్ లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దు అంటూ టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని... పీడీఎఫ్, వామపక్ష పార్టీల ఓట్లు టీడీపీకి వెళ్లాయని తెలిపారు. టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదం అని అన్నారు.
ఈ ఫలితాలు ఏ రకంగానూ ప్రభావం చూపబోవని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని భావించలేమని సజ్జల స్పష్టం చేశారు.
ఇక్కడ ఓట్లు వేసింది సమాజంలో ఓ చిన్న భాగం మాత్రమేనని సజ్జల వెల్లడించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు వైసీపీని ఆదరించారన్న విషయాన్ని గమనించాలని సజ్జల పేర్కొన్నారు. తొలిసారి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం తమకు పెద్ద విజయం అని వివరించారు.