Ram Charan: మా నాన్న .. బాబాయ్ తరువాత నేను అంతలా గౌరవించేది ఆయననే: చరణ్

Ramcharan Interview

  • ఆస్కార్ వేడుక గురించి ప్రస్తావించిన చరణ్ 
  • ఏడాదికి రెండు సినిమాలు చేయాలనుందని వెల్లడి
  • ఎవరినీ అనుకరించే ప్రయత్నం చేయలేదని వ్యాఖ్య
  • రాజకీయాల జోలికి వెళ్లే ఆలోచన లేదని వివరణ  
  • స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా చేయాలనుందన్న చరణ్    


గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ శుక్రవారం న్యూఢిల్లీలో ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. RRR స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ ఇండియన్ సినిమాకు ప్ర‌తినిధిగా పాల్గొన్నారు. త‌న కెరీర్ గురించి  .. 'నాటు నాటు' పాట‌కు 'ఆస్కార్' రావ‌డం గురించి మాట్లాడుతూ .. "ఆస్కార్ పొంద‌డం అపురూప‌మైన విష‌యం. మ‌న సినిమా బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆస్కార్ గెలిచింద‌న్న విష‌యాన్ని నేనింకా న‌మ్మ‌లేక‌పోతున్నాను. నా భార్య నా ల‌క్కీ మ‌స్కాట్‌. ఆమె క‌డుపులో ఉన్న ఐదు నెల‌ల శిశువు నాకు ఇంకా ల‌క్కీ. త్వ‌ర‌లోనే తండ్రిని కాబోతున్నాను. అన్నీ మంచి విష‌యాలు ఒక‌సారే జ‌రుగుతున్నాయి.  

- ఆస్కార్ ఈవెంట్ జ‌రిగిన ప్ర‌దేశంలో ఉండ‌టం అదృష్టంగా భావిస్తున్నాను. నా చిన్న‌త‌నం నుంచి నేను ఆస్కార్‌కి పెద్ద ఫ్యాన్‌ని. మ‌నం ఆస్కార్‌కి రీచ్ అయ్యాం. గెలుస్తామా?  లేదా? అనేది నా దృష్టిలో పెద్ద విష‌యం కానే కాదు. ఆ వేదిక వరకూ  వెళ్ల‌డ‌మే నా దృష్టిలో పెద్ద గౌర‌వం. అది అరుదైన గుర్తింపు. మ‌న సినిమాకు అక్క‌డ ప్ర‌తినిధులుగా నిలుచోవ‌డం ఆనందంగా అనిపించింది.

- ఆస్కార్ వేడుక జ‌ర‌గ‌డానికి ముందు మాలో ఎలాంటి భావోద్వేగాలు లేవు. కంగారుతో స్త‌బ్దుగా అనిపించింది. నా భార్య నా చేతిని గ‌ట్టిగా ప‌ట్టుకోవ‌డం గుర్తుంది. మైక్ టైసన్ గ‌ట్టిగా ప‌ట్టుకున్న‌ట్టు అనిపించింది. ఆస్కార్‌లో 'నాటు నాటు' పాట‌కు నృత్యం చేయ‌డానికి నేను 100 శాతం సిద్ధంగానే ఉన్నాను. కానీ అక్క‌డేం జ‌రిగిందో నాకు నిజంగా తెలియ‌దు. అక్క‌డ పెర్ఫార్మ్ చేసిన‌వారు మాక‌న్నా చాలా బాగా చేశారు. భార‌త‌దేశానికి చెందిన పాట‌కు ఇంకెవ‌రో స్టేజ్ మీద నృత్యం చేస్తుంటే చూసి ఆనందించ‌డం మావంతైంది. 

- నాటు నాటుకు ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రినీ ప్ర‌శంసించాలి. ఉక్రెయిన్‌కి చెందిన 200 మంది  క్రూ మెంబ‌ర్స్ ని కూడా ప్ర‌శంసించారు. నేను, నా భార్య వెకేష‌న్‌కి ఉక్రెయిన్‌కి వెళ్లాల‌నుకున్నాం. కానీ పాట చిత్రీక‌రించిన మూడు నెల‌ల్లోపే అక్క‌డ యుద్ధం జ‌రిగింది. నేనూ, తార‌క్ RRR ప్రారంభం కావ‌డానికి కొన్నేళ్ల క్రిత‌మే స్నేహితుల‌మ‌య్యాం. రాజ‌మౌళి కాక‌పోయి ఉంటే, మ‌రే ద‌ర్శ‌కుడి కోస‌మూ మేమిద్ద‌రం క‌లిసి ఈ ప్రాజెక్ట్ చేసేవాళ్లం కాదేమో.

- రాజ‌మౌళితో నేను చేసిన తొలి సినిమా 'మ‌గ‌ధీర' బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. టాస్క్ మాస్ట‌ర్ల‌తో ప‌నిచేయ‌డం నాకు చాలా ఇష్టం. నా కాళ్ల మీద నేను నిలుచోవ‌డం ఇష్టం. రాజ‌మౌళిగారితో ప‌నిచేయ‌డం అంటే పాఠ‌శాల‌కు వెళ్లిన‌ట్టే భావిస్తాను. మా నాన్న , మా బాబాయ్ త‌ర్వాత నేను అంతగా గౌర‌వించే వ్య‌క్తి రాజ‌మౌళి గారే. 

- ఈ త‌రంలో రీజిన‌ల్ సినిమా అనేదే ఉండ‌దు. ఇప్ప‌టిదాకా మ‌న‌కు వెస్ట్ బెంగాల్ నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు ఎన్నో రీజిన‌ల్ సినిమా ఇండ‌స్ట్రీలు ఉండేవి. కానీ ఇప్పుడు స‌రిహ‌ద్దులు చెరిగిపోయాయి. మూలాల్లోకి వెళ్లి క‌థ‌ల‌ను ప‌ట్టుకోగ‌ల‌గాలి. 'మ‌గ‌ధీర' .. 'ల‌గాన్' .. కొరియా 'పార‌సైట్' అలాంటి సినిమాలే. మట్టి క‌థ‌లను, పోరాటాల క‌థ‌ల‌ను చెప్ప‌గ‌లిగిన‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రి నుంచి ప్ర‌శంస‌లు వ‌స్తాయి. గ్లోబ‌ల్ ఆడియ‌న్స్ మ‌న సినిమాల‌ను .. ఇండియ‌న్ సినిమాల‌ను ఒక్క సినిమాగా చూడ‌గ‌ల‌గాలి.

- నెపోటిజం మీద జ‌రుగుతున్న చ‌ర్చ నాకెప్పుడూ అర్థం కాదు. అస‌లు అందులోని లైన్ల గురించి ఎంత మంది అర్థం చేసుకుంటారో కూడా ఊహించ‌లేం. జ‌ర్న‌లిస్టు పిల్ల‌లు జ‌ర్న‌లిస్టు కావాల‌నుకుంటారు. త‌ల్లిదండ్రుల బాట‌లో పిల్ల‌లు న‌డ‌వాల‌నుకోవ‌డం మ‌న‌కు ఎప్ప‌టి నుంచో వ‌స్తున్న‌దే. నాకు సినిమా అంటే పంచ‌ప్రాణాలు. నేను పుట్టిన‌ప్ప‌టినుంచే ఫిల్మ్ స్కూల్లో ఉన్నా. నాకు ఆ క‌ళ తెలుసు. నేను ప‌నిని స‌క్ర‌మంగా చేయ‌క‌పోతే  ఈ ఇండ‌స్ట్రీలో ఉండ‌లేను. త‌ల్లిదండ్రులు ఈ రంగంలో పేరు ప్ర‌ఖ్యాతుల‌తో ఉంటే, ఒక్క‌డుగు ధైర్యంగా వేయ‌గ‌లుగుతారేమో! కానీ, త‌ద‌నంత‌రం మ‌న టాలెంటే మాట్లాడుతుంది. ప్ర‌తిభ‌ను ఎవ‌రూ ఆప‌లేరు ..  ఎవ‌రి విష‌యంలోనైనా అదే చెల్లుతుంది.

- హాలీవుడ్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నాను. నా క‌ల నెర‌వేరుతుంద‌ని భావిస్తున్నాను. హాలీవుడ్ ప్రాజెక్టుకు సంత‌కం చేశానా?  లేదా? అనేది ఇప్పుడు మాట్లాడ‌టం స‌బ‌బు కాదు. ఏదైనా మెటీరియ‌లైజ్ అయ్యేవ‌ర‌కు ప్రాసెస్‌లో ఉన్న‌ట్టే. కానీ, త‌ప్ప‌క జ‌రిగి తీరుతుంది. నేను వ్య‌క్తిగానూ, న‌టుడిగానూ ఎదుగుతూనే ఉన్నాను. అత్య‌ధిక మంది ప్రేక్ష‌కుల‌కు రీచ్ కావ‌డ‌మే నా ల‌క్ష్యం. బాలీవుడ్ ఎన్నో ఏళ్లుగా ఎన్నెన్నో ఘ‌న విజ‌యాల‌ను సొంతం చేసుకుంది. సౌత్ ఇండియ‌న్ సినిమా వ‌చ్చి ఏదో చేసింద‌ని కాదు. మ‌నం క‌లిసి చ‌రిత్ర సృష్టించాలి.

- నాకు తెలిసి ప్ర‌తి హీరో యాక్ష‌న్ హీరో కావాల‌ని కోరుకుంటాడు. రొమాంటిక్ యాక్ట‌ర్స్ కూడా యాక్ష‌న్ సినిమాలు చేయ‌డానికి అరుదుగా ఆస‌క్తి చూపిస్తుంటారు. నేను నాన్  యాక్ష‌న్ సినిమాలు చేస్తే ప్రేక్ష‌కులు ఆహ్వానిస్తార‌నే భావిస్తున్నాను. నా భార్య షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్. నేను స‌ల్మాన్ ఖాన్ ఫ్యాన్‌. నేను ఇప్ప‌టిదాకా సినిమాల్లో ఎవ‌రినీ అనుక‌రించ‌లేదు. విల‌క్ష‌ణం అనేది న‌టుడికి చాలా కీల‌కం. ఎవ‌రి శైలి వాళ్ల‌కు ఉన్న‌ప్పుడే రాణిస్తారు.

- నేనిప్పుడు శంక‌ర్‌తో సినిమా చేస్తున్నాను. ఈ చిత్రంలో పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. 'రంగ‌స్థ‌లం' సినిమాను మించిన మ‌రో సినిమాలో బెస్ట్ పాత్ర చేస్తాను. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ‌ సెప్టెంబ‌ర్ నుంచి ఉంటుంది. పాశ్చాత్య‌దేశాల్లోనూ ఆ సినిమాను అంగీక‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది.

- ఒకే సమయంలో ఒక సినిమాక‌న్నా ఎక్కువే చేయాల‌నుకుంటున్నాను. కానీ నేను ప‌నిచేస్తున్న‌వారంద‌రూ గొప్ప‌వారు. వారు నా పూర్తి ఏకాగ్ర‌త ఒక్క సినిమా మీదే ఉండాల‌ని కోరుకుంటున్నారు. ఏడాదికి రెండు సినిమాలు చేయాల‌న్న‌ది నా చిర‌కాల క‌ల‌. మా నాన్న 67 ఏళ్ల వ‌య‌సులో మూడు సినిమాలు చేస్తున్నారు. ప్ర‌తిరోజూ తెల్లారుజామున లేచి జిమ్‌కి వెళ్తారు. మా నాన్న‌లాగా నేను కూడా యాక్టివ్‌గా ఉండాల‌ని జ‌నాలు కోరుకుంటున్నారు.

- పెద్ద న‌ట‌న రాక‌పోయినా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో సుదీర్ఘ ప్ర‌యాణం చేయొచ్చు. ఎంత గొప్ప న‌టుడైనా క్ర‌మ‌శిక్ష‌ణ లేకుంటే క‌ష్టాల‌పాల‌వుతాడు. నేను ఒక నావ మీదే ప్ర‌యాణిస్తాను. ఆ నావ సినిమా ఇండ‌స్ట్రీలోనే ఉంది. నాకు రాజ‌కీయాల‌తో ప్ర‌మేయం లేదు. రాజ‌కీయ‌నాయ‌కుడిని కాద‌ల‌చుకోవ‌డం లేదు. నాకు స్పోర్ట్స్ సినిమా చేయాల‌ని ఉంది. ఎప్ప‌టి నుంచో అది క‌ల‌గానే ఉంది .. త్వరలో నెరవేరుతుందేమో చూడాలి" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News