Tirumala: ఆర్టీసీ బస్సులో ప్రయాణంతో సులభంగా శ్రీవారి దర్శనం
- రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు.. రోజుకు వెయ్యిమందికి అవకాశం
- ఈ నెల 18 వరకు లక్షకు పైగా భక్తులు ఆర్టీసీలో ప్రయాణించారు
- టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడి
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతోందని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణించడం ద్వారా ఏడుకొండలవాడిని దర్శించుకోవడం సులభమని చెప్పారు. రోజుకు వెయ్యి మందికి రూ.300 శీఘ్ర దర్శన టికెట్లు అదుబాటులో ఉంటాయని వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి బస్సులు వెళుతున్నాయని చెప్పారు. మార్చి 18 వరకు టీఎస్ ఆర్టీసీలో ప్రయాణించిన 1,14,565 మందికి తిరుమలలో ప్రత్యేక దర్శనం లభించిందని ఓ ప్రకటనలో గోవర్ధన్ వెల్లడించారు.
వేసవి సందర్భంగా తిరుమలలో రద్దీ పెరుగుతుందని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. దర్శన టికెట్ల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తుందని చెప్పారు. రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోసం నెల రోజుల పాటు వేచి చూడాలని, అదే టీఎస్ ఆర్టీసీలో ప్రయాణిస్తే వారం రోజులు చాలని ఆయన వివరించారు. తిరుమల వెళ్లే భక్తులు ఈ సౌకర్యం ఉపయోగించుకోవాలని గోవర్ధన్ తెలిపారు. మరిన్ని వివరాలకు భక్తులు టీఎస్ ఆర్టీసీ వెబ్ సైట్ సందర్శించాలని ఆయన సూచించారు.