cm jagan: సీఎం జగన్ పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు
- తిరువూరు పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు
- జాతీయ రహదారిపై ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా వాహనాల మళ్లింపు
- జగదల్ పూర్ హైవేపై ఇబ్రహీంపట్నం దగ్గర ఆంక్షలు అమలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తిరువూరు పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇబ్రహీంపట్నం వద్ద ట్రాఫిక్ ను మళ్లించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాహనాలను దారిమళ్లిస్తున్నట్లు శనివారమే ప్రకటించారు. ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో తిరువూరుకు చేరుకుంటారు. జాతీయ రహదారిపై ఆయన ప్రయాణం అంతాకలిపి అరగంటలోపే.. అయినప్పటికీ అధికారులు మాత్రం ఇబ్రహీంపట్నం వద్ద ట్రాఫిక్ ను గంటల తరబడి దారి మళ్లించారు. దీనిపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మైలవరం నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను చీమలపాడు సెంటర్ మీదుగా గంపలగూడెం, కల్లూరు వైపు అధికారులు మళ్లించారు. భధ్రాచలం వైపు వెళ్లే వాహనాలను ఎ.కొండూరు అడ్డరోడ్డు నుంచి విస్సన్నపేట మీదుగా సత్తుపల్లి వైపు, భద్రాచలం నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను కల్లూరు, చీమలపాటు వైపు మళ్లిస్తున్నారు. దీనివల్ల అరగంటలో పూర్తయ్యే ప్రయాణం చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల రెండు గంటలు పడుతోందని వాహనదారులు చెబుతున్నారు.