Kunamneni Sambasiva Rao: మీర్జాపూర్, రానా నాయుడు వెబ్‌సిరీస్‌లను ఉపసంహరించుకోవాలి: కూనంనేని
- ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌పై తీవ్ర విమర్శలు
- దగ్గుబాటి కుటుంబం నుంచి ఇలాంటిది రావడం దురదృష్టకరమన్న కూనంనేని
- ఓటీటీని కూడా సెన్సార్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్
ఓటీటీలో ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’పై విమర్శల వేడి తగ్గడం లేదు. ఈ వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత ఓటీటీని కూడా సెన్సార్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలన్న వాదన మరోమారు తెరపైకి వచ్చింది. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌పై నిషేధం విధించాలంటూ మహిళలు డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమకే చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వెబ్ సిరీస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
తాజాగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘రానా నాయుడు’, ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను కూడా తక్షణం సెన్సార్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తెలుగు ప్రజలకు మంచి కుటుంబ చిత్రాలను అందించిన దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి ‘రానా నాయుడు’ వంటి వెబ్ సిరీస్ రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.