Rahul Gandhi: మోదీకి రాహుల్ గాంధీనే అతి పెద్ద టీఆర్పీ: మమతా బెనర్జీ
- కాంగ్రెస్ అగ్రనేతపై మరోసారి విమర్శలు గుప్పించిన బెంగాల్ సీఎం
- రాహుల్ నాయకుడిగా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని వ్యాఖ్య
- ప్రతిపక్షానికి రాహుల్ ముఖచిత్రంగా ఉంటే మోదీని ఎవ్వరూ విమర్శించరన్న మమత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. పార్టీ అంతర్గత సమావేశంలో రాహుల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ‘అతిపెద్ద టీఆర్పీ’ అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని నాయకుడిగా కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటోందని, రాహుల్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ముఖచిత్రంగా ఉంటే ప్రధాని మోదీని ఎవరూ విమర్శించలేరని మమత అన్నారు. విదేశాలలో ఏదో అన్నారంటూ ఇక్కడ గొడవలు జరగడం ఇది వరకు ఎప్పుడైనా చూశామా? అని మమత కార్యకర్తలతో చెప్పారు.
‘పార్లమెంట్ లో అదానీ, ఎల్ఐసీ ఇష్యూపై చర్చలు జరపాలని మేము కోరుకుంటున్నాము. అదానీ సమస్యపై చర్చలు ఎందుకు జరగడం లేదు? ఎల్ఐసీపై చర్చలు ఎందుకు జరగడం లేదు? గ్యాస్ ధరపై చర్చ ఎందుకు జరగలేదు? వీటన్నింటి మధ్య ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టారు. మేం ఉమ్మడి పౌరస్మృతిని అంగీకరించము. దాన్ని అమలు చేయనీయబోము’ అని మమతాబెనర్జీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల యూకే పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం చెలరేగిన నేపథ్యంలో తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.