Jayanti Chauhan: ఇక బిస్లరీ ఇంటర్నేషనల్ ను విక్రయించబోము: కంపెనీ అధినేత ప్రకటన

Jayanti Chauhan to steer Bisleri now

  • టాటాలతో సఫలం కాని చర్చలు
  • బిలియన్ డాలర్లకే విక్రయిస్తామని ప్రమోటర్ల మొండి పట్టు
  • చర్చలను రద్దు చేసుకున్న టాటా కన్జ్యూమర్
  • ప్రమోటర్ కుమార్తె జయంతి చౌహన్ పర్యవేక్షణలో వ్యాపారం నిర్వహణ

టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కు బిస్లరీ ఇంటర్నేషనల్ (బిస్లరీ డ్రింకింగ్ వాటర్ వ్యాపారం)ను విక్రయించే ప్రతిపాదన విజయవంతం కాకపోవడంతో.. బిస్లరీ ప్రమోటర్, వ్యవస్థాపకుడు రమేష్ చౌహాన్ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. చౌహాన్ కుమార్తె జయంతి చౌహాన్ ఇక మీదట బిస్లరీ ఇంటర్నేషనల్ ను నడిపించనున్నట్టు ప్రకటన వెలువడింది. 

‘‘మా నిపుణులైన బృందం సాయంతో జయంతి వ్యాపారాన్ని నడిపిస్తుంది. వ్యాపారాన్ని మేము విక్రయించాలని అనుకోవడం లేదు’’ అని రమేష్ చౌహాన్ ప్రకటించారు. తన తండ్రి స్థాపించిన బిస్లరీ ఇంటర్నేషనల్ కంపెనీలో జయంతి చౌహాన్ (42) వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. సీఈవో యాంగెలో జార్జ్ ఆధ్వర్యంలోని బ‌ృందం కంపెనీని నడిపించనుంది. వీరిపై జయంతి పర్యవేక్షణ ఉంటుంది. 

నిజానికి జయంతి చౌహాన్ కు బిస్లరీ వాటర్ వ్యాపారం పట్ల ఆసక్తి లేదు. రమేష్ చౌహాన్ వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన వయసు 82 ఏళ్లు. కుమార్తెకు ఆసక్తి లేకపోవడంతో కంపెనీని విక్రయానికి పెట్టారు. టాటా కన్జ్యూమర్ చర్చలకు ముందుకు వచ్చింది. కానీ, బిస్లరీని బిలియన్ డాలర్ల కంటే తక్కువకు విక్రయించే ఉద్దేశ్యం రమేష్ చౌహాన్ కు లేకపోవడంతో డీల్ సఫలం కాలేదు. ఈ క్రమంలో తాజా పరిణామాలు జరిగినట్టు తెలుస్తోంది. దేశ సంఘటిత రంగం ప్యాకేజ్డ్ నీటి వ్యాపారంలో బిస్లరీకి 32 శాతం వాటా ఉంది. భవిష్యత్తులో ప్రమోటర్లు తమ నిర్ణయం మార్చుకోరని చెప్పలేమని, మెరుగైన ఆఫర్ వస్తే విక్రయించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News