dandruff: డాండ్రఫ్ ను వదిలించుకోవాలంటే.. మార్గాలున్నాయ్

Can you get rid of dandruff permanently Dermatologist answers

  • తలపై చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి
  • తలకు నూనెలు పట్టించొద్దు
  • కెటోకెనజోల్, జింక్ ఫైరిథియోన్ షాంపూలతో ఫలితాలు
  • పోషకాహారం తీసుకోవడం కూడా అవసరమే

చుండ్రు మహా మొండిది. రసాయనాలతో కూడిన షాంపూలు వాడిన సమయంలో నెమ్మదించే చుండ్రు.. వాటిని ఆపివేసిన వెంటనే మళ్లీ పెరిగిపోతుంటుంది. పైగా ప్రమాదకరమైన రసాయనాల షాంపూలతో శిరోజాలకు పోషకాలు తగ్గిపోతాయి. దీంతో జట్టురాలే సమస్య అధికమవుతుంది. 

డాండ్రఫ్ ఉంటే దురద సమస్య వేధిస్తుంది. కొందరి తలలో చుండ్రు కారణంగా, సున్నిత చర్మ తత్వం ఉన్న వారికి పుండ్లు కూడా పడుతుంటాయి. కొందరిలో చెక్కులు కట్టి దగ్గరగా ఉన్న వారికి కూడా కనిపించేంత స్థాయిలో ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి మెరుగైన మార్గాలు ఎన్నో ఉన్నాయి.

తలపై చర్మం శుభ్రంగా ఉండాలి
డాండ్రఫ్ అన్నది దీర్ఘకాలిక సమస్య. జుట్టు కుదుళ్ల చుట్టూ మలస్సేజియా అనే ఈస్ట్ ఏర్పడుతుంటుంది. దీన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే మొండిగా తయారై కూర్చుంటుంది. కుదుళ్ల వద్ద నూనెలాంటి పదార్థం (సెబమ్) ఉత్పత్తి అవుతుంటుంది. ఇది తల వెంట్రుకలు పొడిబారకుండా రక్షిస్తుంటుంది. తల చర్మంపై ఏర్పడిన ఫంగస్ ను మనం శుభ్రం చేసుకోనప్పుడు అది ఆహారంగా సెబమ్ ను మింగేస్తుంటుంది. ఈ తరుణంలో చుండ్రు సమస్య పెరిగిపోతుంది. 

కెటోకెనజోల్, జింక్ ఫైరిథియోన్ లేదా సెలీనియం సల్ఫైడ్ లేదా పిరోక్టోన్ ఒలామైన్ ఉన్న షాంపూలనే తీసుకోవాలి. షాంపూని తలకు పట్టించి కనీసం 5 నిమిషాలు అలా ఉంచేయాలి. ఆ తర్వాతే తలనంతా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా యాంటీ డాండ్రఫ్ షాంపూని వారంలో రెండు మూడు సార్లు చేస్తే చుండ్రు అదుపులోకి వస్తుంది. చుండ్రు తగ్గిందని అనిపించిన తర్వాత వారంలో ఒకసారి ఈ షాంపూతో చేయవచ్చు.

సరైన ఆహారం
ఫాస్ట్ ఫుడ్, చక్కెరలు ఎక్కువగా ఉన్నవి, అధికంగా ప్రాసెస్ చేసినవి, ఈస్ట్ వృద్ధికి కారణమయ్యే ఆహారాన్ని తీసుకోకూడదు. విటమిన్ బీ, జింక్, ప్రోబయాటిక్ డాండ్రఫ్ ను నియంత్రిస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు), గుడ్లు, నట్స్, అరటి పండ్లు, ఫ్యాటీ ఫిష్, పెరుగు అధికంగా ఉత్పత్తయ్యే సెబమ్ కు పరిష్కారం. 

తలకు నూనె వద్దు
చుండ్రు సమస్యతో బాధపడేవారు తలకు నూనెలను పట్టించొద్దు. నూనె పెట్టడం వల్ల చుండ్రు తగ్గకపోగా, దాన్ని మరింత పెంచేస్తుంది. 

శిరోజాల సంరక్షణ
శిరోజాల సంరక్షణ పట్ల శ్రద్ద చూపించాలి. హెయిర్ స్టయిలింగ్ జెల్ పేరుతో కొన్ని ఉత్పత్తులు ఉన్నాయి. వాటిని వాడకూడదు. సహజ సిద్ధమైన పరిష్కారాలు చూసుకోవడం గమనార్హం. 

ఒత్తిడి
చుండ్రుకి, ఒత్తిడికి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా..? ఒత్తిడితోనూ తలలో చుండ్రు పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లను శరీరం సమర్థవంతంగా అడ్డుకోలేదు. దాంతో చుండ్రు మొండిగా మారిపోతుంది.

  • Loading...

More Telugu News