Pawan Kalyan: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి ఘటనను ఖండిస్తున్నా: పవన్ కల్యాణ్
- ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు
- ఎమ్మెల్యేలపై దాడి దురదృష్టకరమన్న పవన్
- జీవో నెం.1పై చర్చ కోరితే దాడి చేయడం సరికాదని హితవు
- సీఎం సభా గౌరవాన్ని కాపాడాలని సూచన
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జీవో నెం.1పై చర్చ నేపథ్యంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకోవడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి మీడియా ద్వారా అందిన సమాచారం చూస్తే... ఈ పరిణామాలు దురదృష్టకరమైనవని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేవని పేర్కొన్నారు.
ప్రజల గొంతు నొక్కే జీవో నెం.1పై చర్చను కోరిన విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలపై అధికార పక్షం దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఆక్షేపించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
అర్థవంతమైన చర్చలకు ఉద్దేశించిన వేదికలు చట్టసభలు అని, చర్చ కోసం పట్టుబడితే దాడి చేయడం భావ్యం కాదని హితవు పలికారు. ఇదే పరిస్థితి కొనసాగితే, ఈ విధమైన దాడులు చట్టసభల నుంచి వీధుల్లోకి వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయని పేర్కొన్నారు. ముందుగా చట్టసభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపైనా, సభ ప్రిసైడింగ్ అధికారులపైనా ఉందని పవన్ స్పష్టం చేశారు.