Vijayasai Reddy: కేంద్రం నిర్ణయంపై విజయసాయిరెడ్డి ప్రశంసలు
- దేశంలోని ‘ఎనిమీ ప్రాపర్టీ’లను అమ్మనున్నట్లు ప్రకటించిన కేంద్రం
- ఈ నిర్ణయం అద్భుతమన్న విజయసాయిరెడ్డి
- ప్రభుత్వానికి రూ.1 లక్ష కోట్ల ఆదాయం వస్తుందని ట్వీట్
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశంసలు కురిపించారు. పాకిస్థాన్, చైనా దేశాల పౌరసత్వం తీసుకున్న వారు మనదేశంలో వదిలివెళ్లిన ఆస్తులను అమ్మాలన్న నిర్ణయం అద్భుతమని పొగిడారు. సోమవారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘పాకిస్థాన్, చైనా జాతీయులకు చెందిన 12,611 శత్రు ఆస్తులను అమ్మాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో చాలా వరకు ఖాళీ భూమి దొరుకుతుంది. కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ.1 లక్ష కోట్ల ఆదాయం కూడా వస్తుంది’’ అని పేర్కొన్నారు.
పాకిస్థాన్, చైనా దేశాలకు చెందిన వాళ్లు మనదేశంలో వదిలివెళ్లిన ఆస్తులను అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర హోం శాఖ ప్రారంభించింది. ప్రస్తుతం ఆక్రమణదారుల చెరలో ఉన్న ఇలాంటి ఆస్తులను విడిపించేందుకు కసరత్తును మొదలుపెట్టింది.
ఈ ఆస్తులను లీగల్ భాషలో ‘శత్రువు ఆస్తులు’ (ఎనిమీ ప్రాపర్టీస్) అంటారు. మనదేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 12,611 ఎనిమీ ప్రాపర్టీస్ ఉండగా, వాటి మొత్తం విలువ రూ.లక్ష కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.