YS Vivekananda Reddy: వివేకా హత్య కేసు: సుప్రీంకోర్టులో నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్
- వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
- దర్యాప్తు అధికారిని మార్చాలన్న తులశమ్మ
- దర్యాప్తులో జాప్యం చేస్తున్నారని ఆరోపణ
- దర్యాప్తు అధికారి సక్రమంగానే పనిచేస్తున్నాడన్న సీబీఐ న్యాయవాది
- విచారణ వచ్చే సోమవారానికి వాయిదా
వివేకా హత్య కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్ ను మార్చాలంటూ తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.
దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ సీబీఐ దర్యాప్తు అధికారిని ప్రశ్నించింది. కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్ కవర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాది వాదనలు వినిపించారు. దర్యాప్తు అధికారి సజావుగానే తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, దర్యాప్తు సక్రమంగానే నిర్వహిస్తున్నారని సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న పిమ్మట తదుపరి విచారణను సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.