Amazon: మరో 9 వేల మంది ఉద్యోగులపై అమెజాన్ వేటు
- ఇటీవలి కాలంలో 27 వేల మందిని తొలగించిన సంస్థ
- సంస్థ మొత్తం ఉద్యోగులలో ఇది 9 శాతం
- తాజా నిర్ణయంతో 2శాతం మేర పడిపోయిన కంపెనీ స్టాక్
ప్రముఖ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులను ఇంటికి పంపించిన అమెజాన్ కంపెనీ.. తాజాగా మరో విడత ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. ఈసారి సంస్థలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న 9 వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రధానంగా క్లౌడ్, ప్రకటనల విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులనే తొలగించనున్నట్లు సమాచారం. ఆర్థిక అనిశ్చితి, సంస్థ పనితీరు మెరుగుపరుచుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
అమెజాన్ లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల వరుస తొలగింపులతో సంస్థలో పనిచేస్తున్న 27 వేల మందికి కంపెనీ ఉధ్వాసన పలికింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఇలా తొలగింపునకు గురైన వారు 9 శాతం. మిగతా విభాగాల ఉద్యోగుల మాటెలా ఉన్నా క్లౌడ్, ప్రకటనల విభాగంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రతకు ఢోకా ఉండదనే అభిప్రాయాలు ఉండేవి.
ఈ రెండు విభాగాలు అమెజాన్ కు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే, ఆర్థిక అనిశ్చితి ఈ రెండు విభాగాలలో ఉద్యోగులను తొలగించేదాకా చేరిందని అమెజాన్ ఉద్యోగవర్గాలు తెలిపాయి. కాగా, మరోమారు ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేయడంతో అమెజాన్ స్టాక్ విలువ దాదాపు 2 శాతం మేర పడిపోయింది.