USA: ప్రమాదంలో 186 అమెరికా బ్యాంకులు..!

186 US Banks At Risk Of Silicon Valley Bank Like Collapse

  • అమెరికా బ్యాంకింగ్ రంగంపై సోషల్ సైన్స్ రీసెర్చ్ నెట్వర్క్ అధ్యయనం
  • కుప్పకూలే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న సుమారు 190 బ్యాంకులు
  • ప్రభుత్వ బాండ్లలో బ్యాంకుల పెట్టుబడులు
  • ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే బ్యాంకులకు తగ్గనున్న రాబడి

రోజుల వ్యవధిలో అమెరికాలో రెండు బ్యాంకులు కుప్పకూలడంతో ఆర్థికవేత్తల దృష్టి బ్యాంకింగ్ రంగంపై పడింది. ఈ నేపథ్యంలో అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థపై జరిగిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం 186 అమెరికా బ్యాంకులు రిస్క్‌లో ఉన్నట్టు తేలింది. వడ్డీ రేట్ల పెరుగుదల, అధిక శాతం డిపాజిట్లకు ఇన్స్యూరెన్స్ లేకపోవడంతో బ్యాంకులు కుప్పకూలే ప్రమాదం ఎదుర్కొంటున్నాయి. సోషల్ సైన్స్ రీసెర్చ్ నెట్వర్క్ స్టడీ అనే సంస్థ అమెరికా బ్యాంకులపై ఈ అధ్యయనం చేసింది. 

"ఇన్స్యూరెన్స్ రక్షణ లేని డిపాజిటర్లలో ఇప్పటికిప్పుడు సగం మంది తమ నిధులను విత్‌డ్రా చేసుకుంటే దాదాపు 190 బ్యాంకులు ప్రమాదంలో పడతాయి. అంతేకాకుండా.. ఇన్స్యూరెన్స్ ఉన్న డిపాజిట్ల పైనా ఈ ప్రభావం పడుతుంది. 300 బిలియన్ డాలర్ల మేర రిస్క్ ఏర్పడుతుంది’’ అని సదరు సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఇక బ్యాంకింగ్ డిపాజిటర్లలో ఆందోళన మిన్నంటితే మరిన్ని బ్యాంకులు కుప్పకూలే స్థితి వస్తుందని హెచ్చరించింది. 

సోషల్ సైన్స్ అధ్యయనం జరిపిన బ్యాంకుల్లో అధిక శాతం తమ ఆస్తులను గవర్నమెంట్ బాండ్స్, మార్ట్‌గేజ్ ఆధారిత సెక్యూరిటీల్లోకి మళ్లించాయి. వీటి విలువ అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడంతో ఈ ఆస్తుల విలువ పడిపోయి బ్యాంకింగ్ రంగాన్ని ప్రమాదంలోకి నెట్టింది. వడ్డీ రేట్ల పెరుగుదలకు మొదటగా బలయింది సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టిన ఈ బ్యాంకుకు వడ్డీ రేట్ల పెంపు శరాఘాతంగా మారింది.

USA
  • Loading...

More Telugu News