Had Kohli: టీమిండియా కెప్టెన్ కాకపోవడంపై సెహ్వాగ్ స్పందన
- తాను సాధించిన దాని పట్ల సంతోషంగా ఉన్నానని ప్రకటన
- చిన్న గ్రామం నుంచి వచ్చి భారత్ కోసం ఆడే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్టు వెల్లడి
- కోచ్ పదవి కోసం బీసీసీఐ తనను సంప్రదించినట్టు చెప్పిన సెహ్వాగ్
అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్ నుంచి తప్పుకున్న తర్వాత, ఆ పదవికి తాను దరఖాస్తు చేసుకోలేదని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. వీరేంద్ర సెహ్వాగ్ గొప్ప ఓపెనర్లలో ఒకడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్. బ్యాట్ తో విధ్వంసానికే ఆసక్తి చూపించే వాడు. టెస్టుల్లో అత్యధిక స్కోరు (ఒకే మ్యాచ్ లో) సాధించిన ఇండియన్ బ్యాట్స్ మెన్ గా ఘనత సెహ్వాగ్ కే ఉంది. దక్షిణాఫ్రికా జట్టుపై 319 పరుగులు సాధించాడు. క్రికెట్ చరిత్రలో వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
నిజానికి సెహ్వాగ్ కోచ్ గా వస్తాడనే ప్రచారం ఆ మధ్య నడిచింది. అయినా కోచ్ పదవి వరించలేదు. దీనిపై సెహ్వాగ్ టీవీ18తో మాట్లాడుతూ.. ‘‘చౌదరితో (బీసీసీఐ కార్యదర్శి) సమావేశం జరిగింది. ‘కోహ్లీ (నాటి కెప్టెన్), అనిల్ కుంబ్లే మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. నీవు కోచ్ పదవి తీసుకోవాలని కోరుకుంటున్నాం. కోచ్ గా కుంబ్లే కాంట్రాక్టు 2017లో ఛాంపియన్స్ ట్రోఫీతో ముగుస్తుంది. ఆ తర్వాత నీవు భారత జట్టుతో వెస్టిండీస్ వెళ్లాల్సి ఉంటుంది’ అని చెప్పినట్టుగా సెహ్వాగ్ వెల్లడించాడు. అయితే, తనను విరాట్ కోహ్లీ సంప్రదించలేదని, దీంతో తాను కోచ్ కోసం దరఖాస్తు చేసుకోలేదని తెలిపాడు.
ఇక భారత జట్టు కెప్టెన్ గా పనిచేయకపోవడంపై విచారిస్తున్నారా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని సెహ్వాగ్ బదులిచ్చాడు. ‘‘నేను సాధించిన దాని పట్ల సంతోషంగా ఉన్నాను. నజఫ్ గఢ్ అనే చిన్న గ్రామంలోని రైతు కుంటుంబం నుంచి వచ్చి భారత్ కోసం ఆడే అవకాశాన్ని సొంతం చేసుకున్నాను. ఎంతో ప్రేమ, అభినందనలు అభిమానుల నుంచి వచ్చాయి. టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించినా ఇదే విధమైన గౌరవం లభించేది’’అని సెహ్వాగ్ వివరించాడు.