Raja Singh: బెదిరింపులు వస్తున్నాయంటే పట్టించుకోరు.. ‘జైశ్రీరాం’ అంటే మాత్రం వెంటనే స్పందిస్తారు: రాజాసింగ్
- పాకిస్థాన్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ డీజీపీకి రాజాసింగ్ లేఖ
- తనకు ప్రాణహాని ఉందని, లైసెన్స్ గన్ ఇవ్వాలని విజ్ఞప్తి
- పోలీసులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్య
పాకిస్థాన్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు 8 నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పారు. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కు రాజాసింగ్ ఈ మేరకు లేఖ రాశారు. బెదిరింపుల గురించి చెప్పినా.. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు ప్రాణహాని ఉందని లైసెన్స్ గన్ ఇవ్వాలని డీజీపీని రాజాసింగ్ కోరారు. రక్షణ కోసం పదేపదే కోరుతున్నా స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తనపై కేసులున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పోలీస్ శాఖ.. కేసులున్న ఎవ్వరికీ లైసెన్స్ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. తనకు పాకిస్థాన్ నుంచి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ తన లేఖలో తెలిపారు.
‘‘ఓ ఎమ్మెల్యేకు పాకిస్థాన్ నుంచి బెదిరింపులు వస్తున్నా హైదరాబాద్ పోలీసులు పట్టించుకోకపోవడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దురదృష్టకరం. ఒకవేళ ‘జైశ్రీరాం’ అని నేను ట్వీట్ చేస్తే, హిందూ సోదరులకు మద్దతుగా గొంతు వినిపిస్తే మాత్రం.. పోలీసులు వెంటనే స్పందిస్తారు. కేసు నమోదు చేస్తారు’’ అని ట్విట్టర్ లో విమర్శించారు. చర్యలు తీసుకోకుండా హైదరాబాద్ సీపీని ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
గతంలో తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సరిగా లేదని రాజాసింగ్ ఆరోపించారు. కొన్నిసార్లు రోడ్డు మధ్యలోనే ఆగిపోతే వేరే వాహనంలో వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. దీంతో ఆయనకు మరో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ను ప్రభుత్వం కేటాయించింది.