Amruta Fadnavis: డబ్బు కోసం ఫడ్నవీస్ అర్ధాంగిని బ్లాక్ మెయిల్ చేసిన క్రికెట్ బుకీ కుమార్తె
- క్రికెట్ బుకీ అనిల్ జైసింఘానీపై 15 కేసులు
- తన తండ్రిని కేసుల నుంచి బయటపడేయాలన్న అనీక్ష
- అంగీకరించని అమృత ఫడ్నవీస్
- మార్ఫింగ్ వీడియోలు విడుదల చేస్తానని బెదిరింపులు
భారీ నెట్ వర్క్ ఉన్న అంతర్జాతీయ క్రికెట్ బుకీలలో అనిల్ జైసింఘానీ ప్రముఖుడు. మహారాష్ట్రకు చెందిన అతడిపై 15 కేసులు ఉన్నాయి. ఐపీఎల్ వచ్చిందంటే చాలు... అనిల్ జైసింఘానీ కార్యకలాపాలు షురూ అవుతాయి. కోట్ల రూపాయల మేర ఐపీఎల్ మ్యాచ్ లపై బెట్టింగ్ దందా నడిపిస్తుంటాడు.
కాగా, కేసుల నుంచి తప్పించుకునేందుకు పోలీసులకు లంచాలు ఇస్తుంటాడు. ఆ లంచాలు ఇచ్చేటప్పుడు వీడియో తీసి, తిరిగి ఆ పోలీసులనే బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. తన ఇంటికి వచ్చే పోలీసు అధికారులపైకి పెంపుడు శునకాలను వదిలి వారిని భయభ్రాంతులకు గురిచేస్తాడు. అతడి కుమార్తె అనీక్ష కూడా తండ్రికి తగినదే! ఏకంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అర్ధాంగి అమృతను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసింది.
తన తండ్రి అనిల్ ను కేసుల నుంచి బయటపడేయాలని అనీక్ష... అమృత ఫడ్నవీస్ ను కోరింది. అమృత ఒప్పుకోకపోవడంతో, ఆమెపై మార్ఫింగ్ వీడియోలు తయారుచేసి విడుదల చేస్తానని బెదిరించింది. తనకు రూ.10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ కు పాల్పడింది. దాంతో అమృత ఫడ్నవీస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనీక్షను అరెస్ట్ చేశారు. అంతేకాదు, దాదాపు 750 కిలోమీటర్లు వెంటాడి అనిల్ జైసింఘానీని కూడా అరెస్ట్ చేశారు.