Shahid Afridi: భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ ల కోసం ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన అఫ్రిది

Afridi appeals PM Modi to revive India and Pakistan cricket ties

  • భారత్, పాక్ మధ్య నిలిచిపోయిన ద్వైపాక్షిక సిరీస్ లు
  • మ్యాచ్ లు జరిగేలా చూడాలని ప్రధాని మోదీని కోరిన అఫ్రిది
  • బీసీసీఐ బలమైన క్రికెట్ బోర్డు అని వెల్లడి
  • ఇతర బోర్డులతో మైత్రికి ప్రయత్నించాలని హితవు

దాయాదులు భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు ప్రపంచంలో ఏ మూల మ్యాచ్ ఆడినా స్టేడియం హౌస్ ఫుల్ అవ్వాల్సిందే. అయితే, ఇరుజట్ల మధ్య 2012-13 సీజన్ నుంచి ద్వైపాక్షిక సిరీస్ లు నిలిచిపోయాయి. ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీలో మాత్రమే భారత్, పాక్ తలపడుతున్నాయి. 

ఇరుజట్ల మధ్య చివరగా 2007లో టెస్టు మ్యాచ్ జరిగింది. భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు నిలిచిపోవడానికి ఉగ్రవాదం, రాజకీయ పరమైన అంశాలే కారణమని తెలిసిందే. 

ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ స్పందించాడు. భారత్, పాక్ జట్ల మధ్య మళ్లీ మ్యాచ్ లు జరిగేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని అఫ్రిది కోరాడు. దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగేలా చూడాలని మోదీకి విజ్ఞప్తి చేశాడు. 

కాగా, ప్రపంచంలోనే బీసీసీఐ అత్యంత బలమైన క్రికెట్ బోర్డు అని, బీసీసీఐ తమను శత్రుభావంతో చూడరాదని అఫ్రిది కోరాడు. బలంగా ఉన్న బోర్డు ఎక్కువ మందిని మిత్రులుగా చేసుకుంటే మరింత బలపడవచ్చని, అంతే తప్ప ఎక్కువమంది శత్రువులను తయారుచేసుకోవడానికి ప్రయత్నించరాదని సూచించాడు. బీసీసీఐ ఈ దిశగా మైత్రి కోసం కృషి చేయాలని కోరాడు.

  • Loading...

More Telugu News