Manish Sisodia: మనీశ్ సిసోడియాకు మరోసారి కస్టడీ పొడిగించిన ఢిల్లీ కోర్టు
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ ఆరోపణలు
- కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు
- నేటితో ముగిసిన సిసోడియా కస్టడీ
- రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు
- ఏప్రిల్ 5వరకు కస్టడీ విధించిన న్యాయమూర్తి
లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ నేడు కోర్టులో హాజరుపరిచింది. ఆయనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీని మరోసారి పొడిగింది. సిసోడియాకు ఏప్రిల్ 5వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. మనీశ్ సిసోడియాకు నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో, ఆయనను అధికారులు స్పెషల్ జడ్జి ఎంకే నాగ్ ఎదుట హాజరుపరిచారు.
లిక్కర్ స్కాం అవినీతి కేసులో మనీశ్ సిసోడియాకు ఇప్పటికే సీబీఐ కస్టడీ కొనసాగుతోంది. మద్యం హోల్ సేల్ వ్యాపారంలో కొన్ని కంపెనీలకు 12 శాతం లాభాలు చేకూరేలా మద్యం పాలసీలో మార్పులు చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఢిల్లీ మంత్రివర్గ సమావేశ రికార్డుల్లో ఈ నిర్ణయం ఎక్కడా నమోదు కాలేదని ఈడీ చెబుతోంది. ఇది తెర వెనుక తీసుకున్న నిర్ణయం అని భావిస్తోంది.
హోల్ సేల్ మద్యం వ్యాపారులకు భారీ లాభాలు వచ్చిపడేలా విజయ్ నాయర్ నేతృత్వంలో మరికొందరు కలిసి సౌత్ గ్రూప్ సహితంగా ఈ కుట్రకు తెరదీశారని ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తరఫున విజయ్ నాయర్ ప్రతినిధిగా వ్యవహరించాడని పేర్కొంది.
డిజిటల్ ఆధారాలు దొరక్కుండా చేసేందుకు సిసోడియా 14 ఫోన్లు ధ్వంసం చేశాడని ఈడీ వెల్లడించింది. వాటిలో రెండు ఫోన్లను మాత్రం స్వాధీనం చేసుకోగలిగినట్టు తెలిపింది. సిసోడియా ఇతర పేర్లతో సిమ్ కార్డులు, ఫోన్లు పొందాడని వివరించింది.