Gautam Adani: అత్యంత సంపన్న భారతీయుడిగా ముకేశ్ అంబానీ.. 23వ స్థానానికి పడిపోయిన గౌతం అదానీ

Mukesh Ambani only Indian in Hurun Global Rich Lists top 10 billionaires

  • ‘ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ ‌లిస్ట్-2023’ విడుదల
  • అంతర్జాతీయ కుబేరుల్లో టాప్-10లో ముకేశ్ అంబానీ
  • అంబానీ నికర సంపద 82 బిలియన్ డాలర్లు
  • వారానికి రూ. 3 వేల కోట్ల చొప్పున నష్టపోయిన గౌతం అదానీ
  • ఏడాదిలో ఏకంగా 70 బిలియన్ డాలర్లు నష్టపోయిన జెఫ్ బెజోస్

అత్యంత సంపన్నుడైన భారతీయుడిగా ముకేశ్ అంబానీ మరోమారు రికార్డులకెక్కారు. 8,100 కోట్ల డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో నిన్నమొన్నటి వరకు రెండో స్థానంలో ఉన్న గౌతం అదానీ ఏకంగా 23వ స్థానానికి పడిపోయారు. ‘ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ ‌లిస్ట్-2023’ పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అంతర్జాతీయ సంపన్నుల జాబితా టాప్-10లో 9వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాకెక్కిన ఏకైక భారతీయుడు ఆయనే. అంబానీ నికర సంపద 82 బిలియన్ డాలర్లుగా హురున్ పేర్కొంది. నిజానికి గత గతేడాదితో పోలిస్తే అంబానీ సంపద 20 శాతం అంటే 21 బిలియన్ డాలర్లు తగ్గినప్పటికీ, అదానీ సంపద విలువ మరింత క్షీణించడంతో దేశీయ సంపన్నుల జాబితాలో అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని ఆక్రమించారు.

అదానీపై హిండెన్‌బర్గ్ వెలువరించిన నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదానీ సంపద పెరగడానికి మార్కెట్ మాయాజాలమే కారణమని ఆ నివేదిక సంచలన ఆరోపణలు చేసింది. దీంతో అదానీ కంపెనీ షేర్లు ఢమాల్‌మన్నాయి. ఫలితంగా అదానీ గ్రూప్ కంపెనీల విలువ 140 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. అంతకుముందు అదానీ అంతర్జాతీయ కుబేరుల స్థానంలో రెండో స్థానంలో ఉండేవారు. గ్రూప్ కంపెనీలతోపాటు వ్యక్తిగత సంపద కూడా కరిగిపోవడంతో ఆయన ఇప్పుడు ప్రపంచ సంపన్నుల జాబితాలో 23వ స్థానానికి పడిపోయారు. ఆయన ఏడాది వ్యవధిలోనే 35 శాతం అంటే దాదాపు 28 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. 2022-23లో వారానికి 3 వేల కోట్ల రూపాయల చొప్పున అదానీ నష్టపోయినట్టు నివేదిక పేర్కొంది. 

ఇక, ఏడాది కాలంలో అత్యంత ఎక్కువ సంపదను కోల్పోయిన వారిలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన దాదాపు 70 బిలియన్ డాలర్ల సంపదను ఏడాది కాలంలో కోల్పోయారు. అంబానీ, అదానీ కలిపి పోగొట్టుకున్న సంపదతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. ఆసియా అపర కుబేరుల్లో ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న అదానీ స్థానంలో ఇప్పుడు చైనాకు చెందిన ఝెంగూ శాన్‌శాన్ వచ్చి చేరారు. భారత్‌తో పోలిస్తే చైనాలో ఐదురెట్లు ఎక్కవమంది సంపన్నులు ఉన్నారు.

  • Loading...

More Telugu News