Jharkhand: పోలీసుల కాళ్ల కింద నలిగి తన శిశువు మృతి చెందిందంటూ ఓ తల్లి ఆరోపణ
- ఝార్ఖండ్‌లో షాకింగ్ ఉదంతం
- పోలీసుల కాళ్లకింద నలిగి తన బిడ్డ మృతి చెందిందని మహిళ ఆరోపణ
- పోలీసుల తనిఖీల సందర్భంగా ఘటన జరిగిందని వెల్లడి
- మహిళ ఆరోపణలతో కలకలం, దర్యాప్తునకు సీఎం ఆదేశం
ఝార్ఖండ్‌లో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కాళ్ల కింద నలిగి తన బిడ్డ చనిపోయిందంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చెసింది. ఓ నిందితుడిని పట్టుకునే క్రమంలో అతడి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపడంతో ముఖమంత్రి హేమంత్ సొరేన్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. భూషణ్ పాండే అనే వ్యక్తిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో దియోరీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ సంగమ్ పాఠక్ మరికొందరు పోలీసులతో కలిసి అతడి ఇంటికి వెళ్లారు. ఇక పోలీసుల రాకను గమనించగానే ఇంట్లోని వారందరూ పారిపోయారు. నవజాత శిశువును మాత్రం అక్కడే వదిలేశారు. అయితే.. పోలీసులు తన ఇంట్లో గాలింపు చేపడుతున్న సమయంలో తన బిడ్డ నిద్రపోతోందని తల్లి నేహా దేవీ చెప్పుకొచ్చారు. పోలీసులు వెళ్లిపోయాక తిరిగొచ్చి చూస్తే తన బిడ్డ నిర్జీవంగా కనిపించిందని ఆరోపించారు. పోలీసుల కాళ్లకింద పడి తన చిన్నారి మరణించిందంటూ గొల్లుమన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో డీఎస్‌పీ దర్యాప్తునకు ఆదేశించారు. బిడ్డ మృదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. నిందితుడు భూషణ పాండే చిన్నారికి తాతయ్య అవుతాడు.