Telangana: అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు..: రైతులకు సీఎం కేసీఆర్ భరోసా
- ఖమ్మం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్
- దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడిన సీఎం
- ప్రపంచంలో ఎక్కడాలేని రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలోనే ఉన్నయని వెల్లడి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వడగళ్ల వాన కారణంగా పంట దెబ్బతిన్న రైతులతో సీఎం నేరుగా మాట్లాడారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ ఖమ్మం బయల్దేరారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని రామాపురం చేరుకున్నారు. వీడియో లింక్..
దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించి, బాధిత రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలవుతున్నాయని చెప్పారు.
ఈ పథకాలతో రైతులు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారని వివరించారు. అప్పుల ఊబిలో నుంచి బయటపడుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయం దండగని ఇప్పటికీ చెప్పే మూర్ఖపు ఆర్థికవేత్తలు ఉన్నారని సీఎం విమర్శించారు. అయితే, తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ మన దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,05,000 గా ఉందన్నారు. ఇందులో వ్యవసాయ రంగం పాత్ర చాలా ఎక్కువగా ఉందని సీఎం చెప్పారు. తెలంగాణను వ్యవసాయ రాష్ట్రంగా నిలబెట్టుకుంటున్నామని, రైతులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. రైతులకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.