Andhra Pradesh: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు టీడీపీ అభ్యర్థి అనురాధకే... ఇతరులకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే..!
- మొత్తం 7 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు
- అనురాధకు అనుకూలంగా ఓటు వేసిన 23 మంది ఎమ్మెల్యేలు
- జయమంగళం, కోలా గురువులులో ఒక్కరు ఓడిపోనున్న వైనం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం ఏడు సీట్లకు ఎన్నికలు జరగగా... ఇప్పటి వరకు ఆరుగురు గెలుపొందారు. ఇప్పటి వరకు గెలుపొందిన వారిలో వైసీపీ అభ్యర్థులు ఐదుగురు కాగా, ఒక టీడీపీ అభ్యర్థి జయకేతనం ఎగురవేశారు. ఎన్నికల్లో ఓటు వేసిన మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. టీడీపీ అభ్యర్థి అనురాధకు అత్యధిక ఓట్లు పడటం గమనార్హం. ఆమెకు 23 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. టీడీపీకి ఉన్న సంఖ్యాబలం 19 మంది ఎమ్మెల్యేలే కావడం గమనార్హం.
వైసీపీ అభ్యర్థులుగా గెలుపొందిన బొమ్మి ఇజ్రాయెల్, ఏసురత్నం, పోతుల సునీత, సూర్యనారాయణ, మర్రి రాజశేఖర్ లకు ఒక్కొక్కరికి 22 ఓట్లు పడ్డాయి. జయమంగళ, కోలా గురువులకు 21 చొప్పున ఓట్లు పడ్డాయి. దీంతో, వీరిలో విజేత ఎవరనేది నిర్ణయించేందుకు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ ఇద్దరు వైసీపీ అభ్యర్థుల్లో ఒకరు గెలుపొందుతారు. మరొకరు పరాజయం పాలవుతారు.