Sajjala Ramakrishna Reddy: వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ పై సజ్జల స్పందన
- ఆనం, కోటంరెడ్డి టీడీపీకి ఓటు వేసి ఉంటారన్న సజ్జల
- క్రాస్ ఓటింగ్ విషయాన్ని పార్టీ పెద్దలు చూసుకుంటారని వ్యాఖ్య
- చంద్రబాబు ప్రలోభాలకు కొందరు గురయ్యారని విమర్శ
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సభ్యురాలు పంచుమర్తి అనురాధ ఘన విజయం సాధించారు. అనురాధకు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓట్లు పడ్డాయి. క్రాస్ ఓటింగ్ జరగడంతో వైసీపీ నాయకత్వం షాక్ కు గురయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని అన్నారు. తెలుగుదేశం పార్టీలో తొలి నుంచి ఆయన ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారని... ఈ విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన తన నేర్పరితనాన్ని చూపారని అనుకుంటున్నామని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలు గెలుస్తామనే భావించామని... అయితే చంద్రబాబు ప్రలోభాలకు కొందరు గురయ్యారని, ఇక వారి రాజకీయ భవిష్యత్తును వారే చూసుకోవాల్సిందేనని చెప్పారు. చంద్రబాబుది ఎప్పుడూ వాడుకుని వదిలేసే మనస్తత్వమని అన్నారు. ఈ విజయాన్ని బలం అనుకుంటున్నారని, అది చంద్రబాబు పిచ్చితనమని చెప్పారు.
క్రాస్ ఓటింగ్ చేసింది ఎవరనే విషయంలోకి ఇంకా వెళ్లలేదని... పార్టీ పెద్దలు ఈ విషయాన్ని చూసుకుంటారని అన్నారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి ఇద్దరూ టీడీపీకి ఓటు వేసి ఉండొచ్చని చెప్పారు. ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని టీడీపీ వాళ్లు అంటున్నారని... అయితే వాళ్లు ఎవరనే విషయాన్ని మాత్రం వాళ్లు చెప్పరని అన్నారు. టీడీపీ పోటీ పెట్టిన తర్వాత తమ ప్రయత్నాలను తాము చేశామని... అయితే, తెరవెనుక డబ్బు పని చేసి ఉంటుందని చెప్పారు. ఓటమిని అంగీకరిస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా టీడీపీది విజయమని తాము భావించడం లేదని అన్నారు.