Supreme Court: విచారణ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది: సుప్రీంకోర్టులో 14 పార్టీల ఉమ్మడి పిటిషన్
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యాయపోరాటానికి దిగిన ప్రతిపక్షాలు
- రాజకీయ కుట్ర కోసం సీబీఐ, ఈడీలను వాడుకుంటోందని కేంద్రంపై ఆరోపణలు
- విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు..
- వచ్చే నెల 5న విచారిస్తామన్న సీజేఐ బెంచ్
కేంద్రంలోని మోదీ సర్కారు విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొత్తం 14 పార్టీలు ఈమేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. రాజకీయ కుట్రలో భాగంగా ప్రతిపక్షాలపైకి సీబీఐ, ఈడీ వంటి విచారణ సంస్థలను మోదీ ప్రభుత్వం ఉసిగొల్పుతోందని ఆరోపించాయి. ప్రతిపక్ష నేతలపై కుట్రపూరితంగా విచారణ సంస్థల ప్రయోగానికి వ్యతిరేకంగా ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయా పార్టీల ప్రతినిధులు తెలిపారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 5న విచారించనున్నట్లు తెలిపింది.
పిటిషన్ లో ఏముందంటే..
ప్రతిపక్షంలోని ప్రజాప్రతినిధులే లక్ష్యంగా సీబీఐ, ఈడీ వంటి సంస్థలు విచారణ చేపడుతున్నాయి. కేసులు, విచారణల పేరుతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. ఈ కేసులు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరితే అప్పటి వరకున్న కేసులు, వాటి విచారణలు ఆగిపోతున్నాయి. ఇప్పటి వరకు వివిధ ప్రజాప్రతినిధులు, వారి బంధువులకు సంబంధించి కేంద్ర విచారణ సంస్థలు నమోదు చేసిన కేసులలో 95 శాతం ప్రతిపక్ష నేతలే ఉన్నారు. కేసుల విచారణ, అరెస్టులకు సంబంధించి సీబీఐ, ఈడీలు పాటించే మార్గదర్శకాలేవి?.. అంటూ ప్రతిపక్షాల నేతలు ఈ పిటిషన్ లో ప్రశ్నలు లేవనెత్తారు.
ఆ 14 పార్టీలు ఇవే..
కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీయూ, బీఆర్ఎస్, ఆర్జేడీ, ఎస్పీ, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), ఎన్సీపీ, జేఎంఎం, సీపీఐ, సీపీఎం, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్.