blue man: డైటరీ సప్లిమెంట్ మింగడంతో.. నీలం రంగులోకి మారిపోయిన వ్యక్తి
- అమెరికాలోని వాషింగ్టన్ వాసికి ఎదురైన వింత అనుభవం
- ఓ మ్యాగజైన్ చూసి సొంతంగా తయారు చేసుకున్న వైనం
- కొంత కాలానికి బ్లూ రంగులోకి మారిపోయిన చర్మం
సొంత వైద్యం ఎప్పుడూ మంచిది కాదని నిపుణులు చెబుతూనే ఉంటారు. అమెరికాలోని వాషింగ్టన్ కు చెందిన పాల్ క్యారాసన్ ఇలాగే నిపుణుల సాయం తీసుకోకుండా సొంతంగా డైటరీ సప్లిమెంట్ తీసుకున్నారు. అది కూడా సొంతంగా తయారు చేసుకున్నారు. దాన్ని తీసుకున్న కొన్నేళ్లకి ఆయన చర్మం నీలం రంగులోకి మారిపోయింది.
ఆర్థిరైటిస్, డెర్మటైటిస్, ఇతర సమస్యల నుంచి విముక్తి కోసమే క్యారాసన్ ఈ పని చేశారు. 2008లో టీవీ షోలో కూడా ఆయన కనిపించారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న క్యారాసన్ ఓ రోజు న్యూ ఏజ్ మేగజైన్ లో వచ్చిన ఆర్టికల్ చదివారు. అనంతరం ఇంట్లోనే సిల్వర్ క్లోరైడ్ కొల్లాయిడ్ ద్రావకాన్ని తయారు చేసుకుని ఏళ్లపాటు తాగారు. చర్మ సమస్య ఉండడంతో చర్మంపైనా రాసుకున్నారు.
చర్మం రంగు మారిపోయిన విషయాన్ని ఓ రోజు స్నేహితుడు చెప్పిన తర్వాతే క్యారాసన్ గుర్తించారు. తీసుకున్న ద్రావకంలో సిల్వర్ ఉండడంవల్ల ఆ పరిస్థితి ఎదురైంది. కానీ, ఒక్కసారి ఇలా రంగు మారిన తర్వాత తిరిగి పూర్వపు రంగుకు వెళ్లడం సాధ్యం కాదు. అయితే సిల్వర్ క్లోరైడ్ కొల్లాయిడ్ ను తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, ఆర్థరైటిస్ సమస్యలు తగ్గిపోయినట్టు క్యారాసన్ ప్రకటించారు. అందుకే ఆయనకు బ్లూ మ్యాన్ అనే పేరు వచ్చింది. గుండెపోటు కారణంగా 2013లో 62 ఏళ్ల వయసులో ఆయన మరణించారు.