Supreme Court: కరోనా టైమ్ లో విడుదలైన ఖైదీలందరూ మళ్లీ జైలుకు రావాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- తీవ్ర నేరాలు చేయని వారిని, విచారణ ఖైదీలను కరోనా టైమ్ లో విడుదల చేసిన సుప్రీంకోర్టు
- అలా విడుదలైన వారంతా మళ్లీ జైలుకు రావాలని ఆదేశం
- కావాలంటే బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచన
యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించిన సంగతి తెలిసిందే. కరోనా తీవ్రంగా ఉన్ననాటి రోజులు గుర్తుకు వస్తే ఇప్పటికీ హడలిపోతాం. కఠినమైన లాక్ డౌన్లు, సోషల్ డిస్టెన్స్, వ్యాక్సిన్ లతో మహమ్మారి బారి నుంచి ప్రపంచం బయటపడింది. మరోవైపు మన దేశంలో జైళ్లు కిక్కిరిసి పోయి ఉంటాయనే విషయం తెలిసిందే. దీంతో, జైళ్లలోని ఖైదీలు కరోనా బారిన పడకుండా... అప్పట్లో తీవ్ర నేరాలు చేయని వారిని, విచారణ ఖైదీలను విడుదల చేశారు. అలాంటి ఖైదీలపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది.
కరోనా సమయంలో విడుదలైన ఖైదీలందరూ 15 రోజుల్లో మళ్లీ జైళ్లకు రావాలని ఆదేశించింది. జైలుకు వచ్చిన తర్వాత మళ్లీ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. తమ శిక్షను రద్దు చేయాలని కోరుతూ సంబంధిత కోర్టుల్లో కూడా పిటిషన్ వేసుకోవచ్చని తెలిపింది. కరోనా సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడిన అత్యున్నత కమిటీ సిఫారసుల మేరకు తీవ్ర నేరాలు చేయని వారిని, విచారణ ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేశారు.