Rahul Gandhi: రాహుల్ గాంధీపై వేటు వేయడంపై మమతా బెనర్జీ, స్టాలిన్ స్పందన
- బీజేపీకి విపక్ష నేతలు ప్రధాన టార్గెట్ గా మారారన్న మమత
- ప్రజాస్వామ్యం మరింత దిగజారడాన్ని ఈరోజు చూశామని వ్యాఖ్య
- చివరకు న్యాయమే గెలుస్తుందన్న స్టాలిన్
రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ నాలుగేళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు పడింది. దొంగలందరి పేరు వెనుక మోదీ ఉంటుందని అప్పట్లో రాహల్ వ్యాఖ్యానించిన సంగతి విదితమే. రాహుల్ పై వేటు పడిన నేపథ్యంలో బీజేపీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించారు.
మోదీ కొత్త భారత్ లో బీజేపీకి విపక్ష నేతలు ప్రధాన టార్గెట్ గా మారారని మమత అన్నారు. నేరాలు చేసిన బీజేపీ నేతలు కేబినెట్లో ఉన్నారని... ఇదే సమయంలో ప్రసంగాలు ఇచ్చిన విపక్ష నేతలపై వేటు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత దిగజారడాన్ని ఈరోజు చూశామని అన్నారు.
స్టాలిన్ స్పందిస్తూ... ఒక చిన్న మాట అన్నందుకు రాహుల్ గాంధీ వంటి నేతపై వేటు వేయడం దారుణమని అన్నారు. కేవలం విమర్శనాత్మకంగా మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, వ్యక్తిగతంగా విమర్శించలేదని రాహుల్ కూడా వివరణ ఇచ్చారని చెప్పారు. సోదరుడు రాహుల్ తో తాను మాట్లాడానని, ఆయనకు తన సంఘీభావాన్ని ప్రకటించానని తెలిపారు. చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.