Issy Wong: ఇస్సీ వాంగ్ హ్యాట్రిక్... డబ్ల్యూపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లిన ముంబయి ఇండియన్స్
- డబ్ల్యూపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్
- ముంబయి ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్
- వారియర్స్ పై 72 పరుగుల తేడాతో ముంబయి విజయం
- 15 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన ఇస్సీ వాంగ్
మీడియం పేస్ బౌలర్ ఇస్సీ వాంగ్ హ్యాట్రిక్ తో విజృంభించడంతో ముంబయి ఇండియన్స్ జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో ఫైనల్లో ప్రవేశించింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 72 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన యూపీ వారియర్స్... ముంబయి ఇండియన్స్ కు బ్యాటింగ్ అప్పగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన యూపీ వారియర్స్ 17.4 ఓవర్లలో 110 పరుగులకు కుప్పకూలింది. యూపీ జట్టును ఇస్సీ వాంగ్ దెబ్బతీసింది.
ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఇస్సీ వాంగ్ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసింది. ధాటిగా ఆడుతున్న కిరణ్ నవ్ గిరే (43)ను ఆ ఓవర్ రెండో బంతికి అవుట్ చేసిన ఇస్సీ వాంగ్... ఆ తర్వాత వరుసగా మరో రెండు బంతుల్లో సిమ్రాన్ షేక్ (0), సోఫీ ఎక్సెల్ స్టోన్ (0)ను బౌల్డ్ చేసింది. ఈ మ్యాచ్ లో ఇస్సీ వాంగ్ 15 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం.
20 ఏళ్ల ఇస్సీ వాంగ్ ఇంగ్లండ్ కు చెందిన మహిళా క్రికెటర్. భారత్ లో తొలిసారి నిర్వహిస్తున్న డబ్ల్యూపీఎల్ లో ఆమె ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తోంది. డబ్ల్యూపీఎల్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ గా ఇస్సీ రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించుకుంది.
ముంబయి బౌలర్లలో సాయికా ఇషాక్ 2, నాట్ షివర్ 1, హేలీ మాథ్యూస్ 1, జింతిమణి కలిటా 1 వికెట్ తీశారు. కాగా, ఈ నెల 26 ఆదివారం నాడు జరిగే డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం పొందడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్స్ కు నేరుగా క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే.