Vande Bharat Express: వచ్చే నెలలో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు!
- ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే అవకాశాలు
- ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు
- సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో భారీగా ప్రయాణికుల రద్దీ
- వందేభారత్ తో ప్రయాణికులకు మరింత ఉపయుక్తం
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు వస్తోంది. వచ్చే నెలలో సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలును ఏప్రిల్ 8న ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీ మధ్య సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు నడుస్తోంది. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
సికింద్రాబాద్-తిరుపతి మార్గంలోనూ ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి నిత్యం వేల మంది తిరుమల క్షేత్రానికి వెళుతుంటారు. వందేభారత్ రైలు రాకతో తిరుపతి వెళ్లేవారికి మరింత ఉపయుక్తంగా ఉండనుంది.
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా నడపనున్నారు. ఈ రైలు ఆగే స్టేషన్లు, చార్జీలు, ప్రయాణ వేళలు వంటి అంశాలను త్వరలోనే వెల్లడించనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు వారంలో ఒక్కరోజు మినహా మిగిలిన అన్ని రోజులు అందుబాటులో ఉండనుంది.
వచ్చే నెలలో ఈ రైలును ప్రారంభించనున్న నేపథ్యంలో, చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా డివిజన్ల రైల్వే అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది.