Marginal tax: ఆదాయం రూ.7 లక్షలకు పైన కొంచెం ఉంటే పన్ను లేదు!
- ఉపశమనం ప్రకటించిన కేంద్ర సర్కారు
- పరిమితి పైన రూ.2వేల ఆదాయం వచ్చినా పన్ను రూ.26 వేలు
- రూ.7.20-7.30 లక్షల వరకు వెసులుబాటు
ఆదాయపన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు కాస్తంత ఉపశమనం కల్పించింది. ప్రస్తుతం ఆదాయపన్ను పరంగా రెండు రకాల విధానాలు ఉన్నాయి. గతం నుంచి ఉన్న విధానం ఒకటి అయితే, 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని కూడా కేంద్ర సర్కారు తీసుకొచ్చింది. అంతిమంగా పాత విధానాన్ని ఎత్తి వేయాలన్న ఆలోచన కేంద్ర సర్కారుకు ఉంది. ప్రస్తుతం అయితే ఈ రెండు విధానాల్లో పన్ను రిటర్నుల కోసం ఏది ఎంపిక చేసుకోవాలన్నది పన్ను చెల్లింపుదారుల అభీష్టానికే విడిచి పెట్టారు.
నూతన పన్ను విధానంలో ఆదాయం రూ.7 లక్షల వరకు ఉంటే పన్ను చెల్లించక్కర్లేదని ఊరట కల్పించారు. దీనికి రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా ఉంది. ఒకవేళ ఆదాయం రూ.7 లక్షలు దాటి కొంచెం అదనంగా ఉన్నా పన్ను భారం పడుతోంది. ఎలా అంటే ఉదాహరణకు.. రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని ఉపయోగించుకున్న తర్వాత రూ.7 లక్షల రూ.2వేల ఆదాయం ఉందనుకుందాం. అప్పుడు రూ.26,201 పన్ను కింద (సెస్సులతో కలిపి) చెల్లించాల్సి వస్తుంది. కేవలం రూ.2 వేల ఆదాయం ఎక్కువగా వచ్చినందున రూ.26వేలు చెల్లించడం అన్నది అసంబద్ధంగా ఉంది.
అందుకే రూ.7 లక్షలు దాటి కొంచెం ఆదాయం వచ్చిన వారు పన్ను చెల్లించే అవసరం లేకుండా ఉపశమనం లభించింది. రూ.7 లక్షలపైన కొంచెం అంటే ఎంత? అనే దానికి ఇంకా స్పష్టత రాలేదు. రూ.7.20 లేదంటే రూ.7.30 లక్షల వరకు అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది.