Rahul Gandhi: రాహుల్ పై అనర్హత వేటు: ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8(3)పై సుప్రీంలో పిటిషన్
- సెక్షన్ 8(3) చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
- సదరు సెక్షన్ ఏకపక్షంగా ఉందన్న పిటిషనర్
- ఎంపీలు, ఎమ్మెల్యేల భావ స్వేచ్ఛను ఆ చట్టం హరిస్తోందని ఆరోపణ
నేరపూరిత పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేసిన ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(3) చెల్లుబాటును సవాలు చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల జైలు శిక్ష పడితే ఆటోమెటిక్‌గా ప్రజాప్రతినిధుల్ని అనర్హులుగా ప్రకటించే సెక్షన్ 8 విషయంలో దిశానిర్దేశం చేయాలని సుప్రీంను పిటిషనర్ కోరారు. సదరు సెక్షన్ ఏకపక్షంగా ఉందని ఆరోపించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును కూడా పిటిషనర్ ప్రశ్నించారు.
ఈ పిటిషన్ ను కేరళకు చెందిన పీహెచ్డీ స్కాలర్, సామాజిక కార్యకర్త ఆభా మురళీధరన్ వేశారు. సెక్షన్ 8(3)ను న్యాయసమ్మతం లేకుండా రూపొందించారని, అది రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల భావ స్వేచ్ఛను ఆ చట్టం హరిస్తోందని ఆరోపించారు.
నియోజకవర్గ ప్రజలు తమ ఓట్లతో నేతల్ని ఎన్నుకున్నారని, కానీ ఆ చట్టం వల్ల ఆ నేత తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నట్లు చెప్పారు. అడ్వకేట్ దీపక్ ప్రకాశ్ ద్వారా పిటిషన్ దాఖలు చేయించారు. మరో అడ్వకేట్ శ్రీరామ్ పరాకట్ కూడా ఆ పిటిషన్లో కొన్ని అభ్యర్థనలు చేశారు. 1951 చట్టంలోని సెక్షన్ 8, 8ఏ, 9, 9ఏ, 10, 10ఏ, 11కు భిన్నంగా సెక్షన్ 8(3) ఉన్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
‘మోదీ’ ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు ఇటీవల రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల వ్యవధిని కల్పించింది. కానీ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే.. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సచివాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.